Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 28 అనాథ శవాలకు సామూహిక అంత్యక్రియలు

ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బహానగా రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో వెలికితీసిన 28 మృతదేహాలను ఇప్పటి వరకూ ఎవరూ తీసుకెళ్లలేదట.

Published : 08 Oct 2023 22:21 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో (Odisha) నాలుగు నెలల క్రితం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 296 మంది ప్రయాణికులు మృతిచెందగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. గుర్తు పట్టలేకుండా, ఛిద్రమైపోయిన స్థితిలో ఉన్న 28 మృతదేహాలు ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఉన్నాయి. సంబంధిత వ్యకులెవరూ వాటిని తీసుకెళ్లడానికి ఇంతవరకూ రాని నేపథ్యంలో సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనేశ్వర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ వెల్లడించింది. 

వీళ్లేం పోలీసులు.. ప్రమాదస్థలికి వెళ్లి ఇదేం పని!

పట్టాలపై జరిగిన ఘోరకలిలో మొత్తం 296 మంది ప్రాణాలు కోల్పోగా.. 162 మృతదేహాలను ఎయిమ్స్‌కు తరలించారు. చనిపోయిన వారిని గుర్తించిన బంధువులు 81 భౌతికకాయాలను తీసుకెళ్లారు. ఇంకా మిగిలిన 81 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి అందులో 53 మృతదేహాలను అప్పగించే కార్యక్రమం పూర్తి చేశారు. 28 మృతదేహాలు మాత్రం ఎయిమ్స్‌ శవాగారంలోనే అప్పటి నుంచి ఉండిపోయాయి. ఈ మృతదేహాలు వలస కార్మికులవి కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. వారు పశ్చిబెంగాల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి పని వెతుక్కుంటూ వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. అందుకే సంబంధీకులెవరూ ముందుకు రావడం లేదనే అంచనాకు వచ్చారు. పోలీస్‌ మ్యాన్యువల్ ప్రకారం అనాథ శవాలకు 30 రోజులు దాటితే అంత్యక్రియలు నిర్వహించాలి. రైలు ప్రమాదం కేసును సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ ఆలస్యమైంది.

ఫ్రీజర్లలో భద్రపరిచిన శవాలను దహనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, దానిపై అభిప్రాయం తెలపాలని ఒడిశా అధికారులు కొన్ని రోజుల క్రితం సీబీఐకి లేఖ రాశారు. దాంతో ఆ దిశగా ముందుకెళ్లాలని ఖుర్దా జిల్లా కలెక్టర్‌కు సీబీఐ లేఖ రాసింది. అంత్యక్రియలకు సీబీఐ అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, వారు ఎప్పుడొస్తారో స్పష్టంగా చెప్పలేమని బీఎంసీ కమిషనర్‌ విజయ్‌ అమృత కులంగే తెలిపారు. దహన సంస్కారాల మొత్తం ప్రక్రియను వీడియో తీయనున్నారని సమాచారం. 

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఓ గూడ్స్ రైలు, యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు జూన్‌ 2న పరస్పరం ఢీకొట్టడంతో పెను విషాదం రేపిన విషయం తెలిసిందే. బహానగా రైల్వేస్టేషన్లో ఈ మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో బోగీల మధ్య చిక్కుకున్న మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టలేకుండా మారాయి. దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైల్వే ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు