Republic Day: ‘థాంక్యూ ఇండియా’.. వీడియో షేర్‌ చేసిన మెక్రాన్‌

భాతర గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ తెలిపారు. 

Updated : 26 Jan 2024 15:54 IST

దిల్లీ: గణతంత్ర వేడుకల్లో (Republic Day) ఫ్రాన్స్‌ (France) సైనిక దళానికి కవాతు చేసే అవకాశం కల్పించినందుకు ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘ఇది ఫ్రాన్స్‌కి దక్కిన గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా’ అని కర్తవ్యపథ్‌లో ఫ్రాన్స్ సైన్యం కవాతు చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అంతకుముందు భారత ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌లో (గతంలో ట్విటర్‌) ప్రధాని మోదీతో ఉన్న ఫొటో షేర్‌ చేశారు. ఈ సంబరాల్లో భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు.

‘చంద్రయాన్‌-3.. బాలక్‌ రామ్‌’.. పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు

ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు మెక్రాన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్న ఆయనకు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. అంతకుముందు భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం గురువారం ప్రత్యేక విమానంలో జైపుర్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్న తర్వాత నేతలిద్దరూ ఓ దుకాణం వద్ద చాయ్‌ తాగుతూ ముచ్చటించుకున్నారు. ఈసందర్భంగా మెక్రాన్‌ కీలక ప్రకటన చేశారు. ఎక్కువమంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని