Republic Day: ‘చంద్రయాన్‌-3.. బాలక్‌ రామ్‌’.. పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు

Republic Day Parade: గణతంత్ర పరేడ్‌లో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. చంద్రయాన్‌-3, అయోధ్య బాలక్‌రామ్‌, ఎన్నికల నిర్వహణ, కొత్త పార్లమెంట్‌.. ఇలా పలు విశేషాలను ప్రదర్శించారు.

Updated : 26 Jan 2024 14:12 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో గణతంత్ర దినోత్సవాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌ (Republic Day Parade)లో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ భారత్‌ సాధించిన చంద్రయాన్‌-3 విజయం నుంచి అయోధ్యలో ఇటీవల కొలువైన బాల రామయ్య వరకూ అనేక విశేషాలను వీటిల్లో ప్రదర్శించారు. అవి సందర్శకుల మనసు దోచుకున్నాయి.

శకటాల విశేషాలివే..

  • భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రదర్శించిన శకటంలో చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1 మిషన్లు ఆకట్టుకున్నాయి. చంద్రుడిపై మన విక్రమ్‌ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ఇందులో ప్రదర్శించారు. శకటంపై ఉన్న మహిళా శాస్త్రవేత్తలు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ దిగిన శివశక్తి పాయింట్‌ను చూపించారు.
  • మణిపుర్‌ శకటం ప్రత్యేకంగా నిలిచింది. ఈ రాష్ట్రంలో 500 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఇమా కెయితల్‌’ మార్కెట్‌ను ప్రదర్శించారు. దీన్ని పూర్తిగా మహిళా విక్రేతలే నడుపుతారు. ప్రపంచంలో మహిళలు నిర్వహిస్తున్న అతిపెద్ద మార్కెట్‌ ఇదే కావడం విశేషం.
  • ఉత్తరప్రదేశ్‌ శకటంలో రామ్‌ లల్లా చిత్రం ఆకట్టుకుంది. అయోధ్యలో నవనిర్మిత భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా దీన్ని ప్రదర్శించారు. శకటానికి ముందు బాలక్‌రామ్‌ విల్లు-బాణంతో దర్శనమిచ్చారు. దీంతో పాటు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాను చాటిచెప్పే ‘కలశం’, అయోధ్య దీపోత్సవ్‌, హైస్పీడ్‌ రైళ్లను ప్రదర్శించారు.
  • కేంద్ర ఐటీ,  ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ శకటంలో కృత్రిమ మేధ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఆరోగ్యం, విద్య, సామాజిక సాధికారతకు ఏఐ ఎలా ఉపయోగపడుతోందో తెలిపారు.
  • భారత్‌ అధ్యక్షతన విజయవంతమైన జీ20 సదస్సును కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తమ శకటంలో ప్రదర్శించింది. దీనిపై ఏర్పాటు చేసిన ‘నమస్తే ముద్ర’ ఆకట్టుకుంది.
  • మరికొద్ది రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పరేడ్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది. ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లుగా రూపొందించిన ఈ శకటం ఆకట్టుకుంది.
  • కేంద్ర ప్రజా పనుల విభాగం (CPWD) శకటంలో నూతన పార్లమెంట్‌ భవనం, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రాన్ని ప్రదర్శించారు.
  • ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ థీమ్‌తో మహారాష్ట్ర తమ శకటాన్ని ప్రదర్శించింది.

అమేయ శక్తిలో ‘ఆమె’.. గణతంత్ర పరేడ్‌ను నడిపించిన నారీమణులు

తెలుగు రాష్ట్రాల శకటాలు ఇలా..

ఈ పరేడ్‌లో తెలుగు రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. అమర వీరులను స్మరించుకునేలా తెలంగాణ శకటాన్ని తీర్చిదిద్దారు. దీనికి ‘జయ జయహే తెలంగాణ’గా నామకరణం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో కుమురం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యారంగం థీమ్‌తో ఏపీ శకటాన్ని ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని