Devoleena: దయచేసి సాయం చేయండి.. అమెరికాలో మిత్రుడి హత్యపై కేంద్రానికి టీవీ నటి విజ్ఞప్తి

అమెరికాలో హత్యకు గురైన తన స్నేహితుడి విషయంలో సాయం కోరుతూ ప్రముఖ టెలివిజన్ నటి దేవోలీనా భట్టాచార్జీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.

Published : 02 Mar 2024 01:47 IST

కోల్‌కతా: అమెరికా (USA)లో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో మృతి చెందిన తన స్నేహితుడి విషయంలో సాయం కోరుతూ ప్రముఖ టెలివిజన్ నటి దేవోలీనా భట్టాచార్జీ (Devoleena Bhattacharjee) కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. మృతదేహాన్ని అప్పగించేలా చూడటంతోపాటు హత్యకు గల కారణాలు వెల్లడయ్యేలా చొరవ చూపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌లకు ‘ఎక్స్‌’ వేదికగా శుక్రవారం విజ్ఞప్తి చేశారు. అతడి తల్లిదండ్రులు ఇదివరకే మృతి చెందారని తెలిపారు.

‘‘కోల్‌కతాకు చెందిన నా మిత్రుడు అమర్‌నాథ్‌ ఘోష్‌ను అమెరికాలోని సెయింట్‌ లూయీ అకాడమీ పరిసరాల్లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడు. ఘోష్‌ బాల్యంలోనే తండ్రిని, మూడేళ్ల క్రితం తల్లిని కోల్పోయాడు. అతడే ఏకైక సంతానం. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కొద్దిమంది స్నేహితులు తప్ప అతడికి ఎవరూ లేరు. అతడో అద్భుతమైన డ్యాన్సర్. పీహెచ్‌డీ చేస్తున్నాడు. అమెరికాలోని కొంతమంది స్నేహితులు మృతదేహాన్ని తీసుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ, ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. దయచేసి సాయం చేయండి. కనీసం అతడి హత్యకు గల కారణాలేంటో తెలియాలి’’ అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జైశంకర్‌లను ట్యాగ్‌ చేస్తూ ఆమె ట్వీట్‌ చేశారు.

రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు..!

షికాగోలోని భారత దౌత్య కార్యాలయం ఈ వ్యవహారంపై స్పందించింది. ‘‘అమర్‌నాథ్ ఘోష్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కేసులో పోలీసుల దర్యాప్తును అనుసరిస్తున్నాం. అవసరమైన సహకారం అందజేస్తున్నాం’’ అని ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉండగా.. బుల్లితెర నటి దేవోలీనా పలు హిందీ సీరియళ్లలో నటించారు. ‘‘సాథ్‌ నిభానా సాథియా’’లో గోపీ బహూ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ ‘బిగ్ బాస్‌’లో కూడా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని