Pratibha Singh: మోదీ నిరాశపరిస్తే.. గడ్కరీ సహాయం చేశారు: కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు ప్రధాని మోదీ (Modi), కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 

Published : 05 Apr 2024 18:31 IST

శిమ్లా: భారీ వర్షాలతో అతలాకుతలమైన తమ రాష్ట్రానికి ప్రధాని మోదీ (Modi) నుంచి ఆశించిన సహాయం అందలేదని హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్ ప్రతిభా సింగ్ (Pratibha Singh) అన్నారు. అయితే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మాత్రం తమను ఆదుకున్నారని, రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించారని చెప్పారు.

‘‘వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్‌ భారీ ప్రకృతి విపత్తును ఎదుర్కొంది. ఆ సమయంలో కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం ఏమీ అందలేదు. అప్పుడు నేను ప్రధాని మోదీని కలిశాను. ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించాను. ఇప్పటికే మీ ముఖ్యమంత్రి భేటీ అయ్యారని, సాధ్యమైనంత వరకు సహాయం అందుతుందని చెప్పారు. ఆ మేరకు ప్రకటన వస్తుందని ఆశించాను. కానీ నిరాశే ఎదురైంది. కానీ ఆ సమయంలో గడ్కరీ గొప్ప సహకారం అందించారు’’ అని సింగ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని చెప్పారు.

ప్రతిభాసింగ్ .. హిమాచల్ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి. ఈమె ప్రస్తుతం మండి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి కంగనా రనౌత్‌ను భాజపా బరిలో దింపింది. ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం హిమాచల్ రాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. అప్పుడు ఆమె భాజపా పనితీరును కొనియాడిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సూచనలతో   ఆ పార్టీ చురుగ్గా పని చేస్తోందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని