Gaganyaan: గగన్‌యాన్‌ వ్యోమగామి నా భర్తే.. వెల్లడించిన ప్రముఖ నటి

Malayalam actress Lena: గగన్‌యాన్ యాత్ర కోసం ఎంపికైన వ్యోమగామి ప్రశాంత్‌ నాయర్‌ తన భర్తేనని ప్రముఖ నటి లీనా వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

Updated : 28 Feb 2024 11:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌ (Gaganyaan)’ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం ప్రకటించారు. ఇందులో ఒకరైన గ్రూప్‌ కెప్టెన్ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ (Prasanth Balakrishnan Nair)ను తాను ఇటీవల వివాహం చేసుకున్నట్లు ప్రముఖ మలయాళ నటి లీనా (Actress Lena) వెల్లడించారు. గగన్‌యాన్‌ బృందాన్ని ప్రధాని ప్రకటించిన కొద్ది గంటల తర్వాత లీనా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

‘‘ఫిబ్రవరి 27న మన ప్రధాని మోదీజీ తొలి ‘ఆస్ట్రోనాట్ వింగ్స్‌’ను ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌, గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌కు అమర్చారు. ఇది మన దేశానికి, కేరళ రాష్ట్రానికి, వ్యక్తిగతంగా నాకు ఎంతో గర్వించదగ్గ విషయం. వృత్తిపరంగా కొన్ని కారణాల వల్ల ఓ విషయాన్ని ఇప్పటివరకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. దాన్ని చెప్పేందుకు ఇంతకంటే గొప్ప సమయం ఉండదు. ఈ ఏడాది జనవరి 17న నేను ప్రశాంత్‌ను వివాహం చేసుకున్నా. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. సంప్రదాయ పద్ధతిలో కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగింది’’ అని లీనా రాసుకొచ్చారు. తమ పెళ్లి ఫొటోతో పాటు, ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌తో కలిసి దిగిన చిత్రాలతో ఉన్న వీడియోను ఆమె పంచుకున్నారు. అయితే, ఈమె ప్రకటనపై ప్రశాంత్‌ కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అంతరిక్షంలోకి భారత దూతలు వీరే..!

1976లో కేరళలో జన్మించిన ప్రశాంత్‌.. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి.. ‘స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ దక్కించుకున్నారు. 1998 డిసెంబరులో వాయుసేనలో ఫైటర్‌ పైలట్‌గా చేరారు. 3వేల గంటల ఫ్లయింగ్‌ అనుభవాన్ని సాధించారు. ‘కేటగిరీ-ఏ’ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ హోదాను పొందారు. అమెరికాలోని యూఎస్‌ స్టాఫ్‌ కాలేజీలో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌కు ఎంపికయ్యారు.

ఇక, మలయాళ చిత్రసీమలో నటి, రచయిత, స్క్రిప్‌రైటర్‌గా లీనా గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళంతో పాటు హిందీ, తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 175 చిత్రాల్లో అలరించారు. ఇటీవల విడుదలైన తెలుగు వెబ్‌సిరీస్‌ ‘సైతాన్‌’లో ఈమె నటించారు. కాగా.. లీనాకు ఇది రెండో వివాహం. అంతకుముందు అభిలాష్‌ కుమార్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా.. 2013లో విడాకులు తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని