Green energy park: అదానీ గ్రీన్‌ ఎనర్జీ పార్క్‌.. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందటా..

గౌతమ్‌ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్‌ గుజరాత్‌లో గ్రీన్‌ ఎనర్జీ పార్క్‌ నిర్మిస్తోంది. ఇది అంతరిక్షం నుంచి చూసిన కనిపిస్తుందని గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు.    

Updated : 08 Dec 2023 00:50 IST

అహ్మదాబాద్‌: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ(Gautam Adani)కి చెందిన అదానీ గ్రూప్‌ గుజరాత్‌(Gujarat)లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌(Rann of Kutch) ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్రీన్‌ ఎనర్జీ పార్క్‌(Green Energy Park)ను ఏర్పాటు చేస్తోంది. ఈ పార్క్‌ను 726 చదరపు కి.మీ పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద పార్క్‌ అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందట. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ అదానీ ‘ఎక్స్‌’(ట్విటర్) వేదికగా గ్రీన్‌ ఎనర్జీ పార్క్‌కు సంబంధించి విశేషాలను పంచుకున్నారు. కొన్ని చిత్రాలను పోస్టు చేశారు. 

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్‌ నిర్మాణం చేపట్టి పునరుత్పాదక ఇంధన రంగంలో భారత దేశ అద్భుత పురోగతికి సంబంధించి కీలక భూమిక పోషిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. వాతావరణ పరంగా చాలా సవాళ్లు ఎదురయ్యే రాణ్‌ ఆఫ్‌ కచ్‌లో ఈ గొప్ప ప్రాజెక్టును మొత్తం 726 చదరపు కి.మీ.లలో చేపడుతున్నాం. అంతరిక్షం నుంచి నుంచి చూసినా ఈ పార్క్‌ కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రెండు కోట్ల ఇళ్లకు సరిపడా 30 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాం. పర్యావరణ అనుకూల సౌర, పవన విద్యుత్‌ కోసం విస్తృత, సమీకృత పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలో ఒక ప్లాంట్‌ను మన ఖర్మ భూమిగా పిలిచే ముంద్రాకు కేవలం 150 కి.మీ దూరంలో నిర్మిస్తున్నాం. పునరుత్పాదక విద్యుత్‌ రంగానికి సంబంధించి స్థిరమైన శక్తి సాధనకు భారత్‌ మొదలుపెట్టిన ప్రయాణంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. అంతేకాకుండా సౌర కూటమి, ఆత్మనిర్భర్‌ భారత్‌ చొరవ పట్ల ఇది మా నిబద్ధతను తెలియజేస్తుంది’’ అని గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. 

ఈ ప్రాజెక్టుతో ఇండియా గ్రీన్‌ ఎనర్జీ సామర్థ్యం పెరగడమే కాకుండా ‘కాప్‌’ సదస్సు వాగ్దానాలను సైతం నెరవేర్చడంలో ఇది ఎంతో కీలకపాత్ర పోషించనుంది. 2021లో జరిగిన కాప్‌ 26 సదస్సులో భారత్‌ ‘పంచామృత్‌’ వాగ్దానం చేసింది. దీనిలో భాగంగా 2030లోగా వాతావరణంలో 1 బిలియన్‌ టన్నుల కాలుష్య ఉద్గారాలను తగ్గించడం, 500 గిగావాట్ల శిలాజ రహిత విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వంటివి ఉన్నాయి. కాప్‌ సదస్సులో భారత్‌ తీసుకున్న నిర్ణయాల్లో ఈ గ్రీన్‌ ఎనర్జీ పార్క్‌ కీలక పాత్ర పోషించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని