మోదీ ‘రెడ్‌ డైరీ’ విమర్శలు.. ‘రెడ్‌ టమాటా’ కౌంటర్ ఇచ్చిన గహ్లోత్‌..!

రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన విమర్శలను ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్(Ashok Gehlot) తిప్పికొట్టారు. ధరల భారంతో ప్రజలు అల్లాడిపోతున్నారని వ్యాఖ్యానించారు. 

Published : 27 Jul 2023 15:43 IST

జైపుర్‌: ఇటీవల కాలంలో రాజస్థాన్‌ రాజకీయాల్లో రెడ్‌ డైరీ(Red Diary) కలకలం సృష్టిస్తోంది. రాజస్థాన్‌(Rajasthan) పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) ఆ డైరీ ప్రస్తావన తెచ్చారు. అందులోని రహస్యాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ(కాంగ్రెస్‌)ని నాశనం చేస్తాయని ఆయన విమర్శలు గుప్పించారు.  ఆ వ్యాఖ్యలకు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌(Ashok Gehlot) కౌంటర్ ఇచ్చారు.  

ప్రధాని ఓ కల్పిత రెడ్‌ డైరీ(Red Diary)ని చూడగలుగుతున్నారని,  ఎరుపు రంగులో ఉన్న టమాటాలు, సిలిండర్లు మాత్రం ఆయనకు కనిపించడం లేదని గహ్లోత్‌ బదులిచ్చారు. ‘రెడ్‌ డైరీ(Red Diary) అనేది ఊహాజనితమైంది. అసలు అలాంటి డైరీ ఏదీ లేదు. ఆయన రెడ్‌ డైరీని చూడగలరు.. కానీ రెడ్ సిలిండర్లు, రెడ్ టమాటాలను చూడలేరు. ధరల భారంతో ఎర్రగా మారిపోయిన ప్రజల ముఖాలు కనిపించడం లేదు. ఎన్నికల్లో ప్రజలు ఆయన రెడ్‌ఫ్లాగ్ చూపిస్తారు’ అంటూ స్పందించారు.  ఇటీవల కాలంలో టమాటా ధరలు ఆకాశన్నంటిన సంగతి తెలిసిందే. దాంతో వాటిని కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. 

వివాహాది శుభకార్యాల్లో ‘పాటలకు’ కాపీరైట్‌ వర్తించదు: కేంద్రం

ఏమిటీ రెడ్‌ డైరీ..

రాజస్థాన్‌ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌లో అవకతవకలకు సంబంధించి ఛైర్మన్‌ ధర్మేంద్ర రాఠోడ్‌ ఇంట్లో ఈడీ, ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సూచన మేరకు తాను రెడ్‌ డైరీని జాగ్రత్త పరిచానని రాజేంద్ర గుఢా తెలిపారు. అశోక్‌ గహ్లోత్‌, ఆయన కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ల సూచనల మేరకు డబ్బును ఎమ్మెల్యేలకు ఇచ్చానని రాఠోడ్‌ ఆ రెడ్‌ డైరీ(Red Diary)లో రాశారని వివరించారు. ఆ డైరీని రాఠోడ్‌ రాశారని, అందులో ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి పేర్లున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి అసెంబ్లీలో సొంత ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని మాట్లాడిన రాజేంద్ర సింగ్‌ను ఇటీవల గహ్లోత్‌ కేబినెట్‌ నుంచి తొలగించారు.  

అందుకే యూపీఏ పేరు మార్చారు: మోదీ 

‘పేదలపై పన్నిన కుట్రలను దాచిపెట్టేందుకు వారు(ప్రతిపక్షాలు) తమ పేరును యూపీఏ(UPA) నుంచి ఇండియాకు మార్చుకున్నారు. గతంలో అవకతవకలకు పాల్పడిన కంపెనీలు తమ పేర్లను మార్చినట్టుగా కాంగ్రెస్ దాని భాగస్వాములు పేరు మార్చుకునారు. ఉగ్రవాదం ముందు తలవంచుకున్నామనే మరకను తొలగించుకునేందుకు పేరు మార్చుకున్నారు. ఈ  దేశ శత్రువుల మాదిరిగా వారి తీరు ఉంది’ అని మోదీ(Modi) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని