గాంధీ పేరు ప్రస్తావించలేదు: హెగ్డే

తాను మహాత్మా గాంధీని ఉద్దేశించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని.. కొందరు తన మాటల్ని వక్రీకరించారని భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్‌ హెగ్డే అన్నారు..........

Published : 05 Feb 2020 00:38 IST

దిల్లీ: తాను మహాత్మాగాంధీని ఉద్దేశించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని.. కొందరు తన మాటల్ని వక్రీకరించారని భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్‌ హెగ్డే అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారమని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నాన్నారు. తన ప్రసంగంలో ఏ పార్టీనిగానీ, మహాత్మాగాంధీని గానీ ప్రస్తావించలేదన్నారు. తన ప్రసంగంలో గాంధీ, నెహ్రూల పేర్లు వినిపిస్తే నిరూపించాలని సవాల్‌ విసిరారు. తాను కేవలం స్వాతంత్ర్యోద్యమం గురించి మాత్రమే వివరించానన్నారు. 

ఏ త్యాగమూ చేయనప్పటికీ, తన సత్యాగ్రహంతోనే స్వాతంత్య్రం సిద్ధించినట్లు దేశ ప్రజలను గాంధీ నమ్మించారని హెగ్డే పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు నేడు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాటమంతా బ్రిటిష్‌ పాలకులతో ‘సర్దుబాటు’ ద్వారా జరిగినదేనని ఆయన ఆరోపించారు. బెంగళూరులో శనివారం నిర్వహించిన ఓ సమావేశంలో హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఆలస్యంగా వెలుగుచూశాయి. హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది. దీంతో స్పందించిన భాజపా సోమవారం హెగ్డేకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఈరోజు పార్లమెంటులోనూ హెగ్డే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. నిరసనగా కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. హెగ్డే క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ లోక్‌సభాపక్షనేత అధిర్‌ రంజన్‌ చౌధురి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న శాంతియుత ఆందోళనలు మహాత్ముడి సత్యాగ్రహ స్ఫూర్తితోనే జరుగుతున్నాయన్నారు. ప్రపంచం మొత్తం ఆరాధించే వ్యక్తిపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సహించరాని చర్య అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని