Pakistan: అమెరికా అధ్యక్షుడి నిర్ణయం సరైనదే!

అఫ్గాన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో... పాకిస్థాన్‌కు చెందిన జాతీయ భద్రతా సంఘం (ఎన్‌ఎస్‌సీ) సోమవారం

Published : 17 Aug 2021 15:59 IST

 పాక్‌ జాతీయ భద్రత సంఘం సమర్థన 

ఇస్లామాబాద్‌: అఫ్గాన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో... పాకిస్థాన్‌కు చెందిన జాతీయ భద్రతా సంఘం (ఎన్‌ఎస్‌సీ) సోమవారం కీలక సమావేశం నిర్వహించింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దీనికి అధ్యక్షత వహించారు. అఫ్గాన్‌ నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఈ కమిటీ సమర్థించింది. పొరుగు దేశంలో విదేశీ దళాలు దీర్ఘకాలం తిష్ట వేయడం వల్ల భిన్నమైన ఫలితాలేవీ రాలేదని తీర్మానించింది. కాబుల్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయ సిబ్బంది చేస్తున్న కృషిని ఇమ్రాన్‌ ప్రశంసించారు. అఫ్గాన్‌ నుంచి స్వదేశానికి వచ్చే పాకిస్థాన్‌ పౌరులు, దౌత్య సిబ్బంది, పాత్రికేయులు, అంతర్జాతీయ సంస్థల సభ్యులకు సాధ్యమైనన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సైన్యాధిపతి జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా, విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ తదితరులు పాల్గొన్నారు. అఫ్గానిస్థాన్‌ పరిణామాలు పాకిస్థాన్‌పైనా, ప్రాంతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయన్న విషయమై సమావేశంలో చర్చకు వచ్చినట్టు ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్థాన్‌లో శాంతి, భద్రత, సుస్థిరాభివృద్ధికి అంతర్జాతీయ సమాజం సహకరించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి. ఆ దేశంలో సమ్మిళిత రాజకీయ పరిష్కారం కోసం పాకిస్థాన్‌ కృషి చేస్తుందని ఉద్ఘాటించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని