నదిలో దూకి ముగ్గురిని కాపాడిన గోవా బాలుడు

గోవాలో పదేళ్ల బాలుడు నదిలో మునిగిపోతున్న ముగ్గురు మిత్రులను తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ కాపాడి ఔరా అనిపించాడు.

Published : 02 Apr 2023 05:19 IST

గోవాలో పదేళ్ల బాలుడు నదిలో మునిగిపోతున్న ముగ్గురు మిత్రులను తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ కాపాడి ఔరా అనిపించాడు. రాష్ట్ర రాజధాని పణజీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబార్జువాలో గ్రామదేవత ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా స్నేహితులు నలుగురూ అక్కడికి వెళ్లారు. రంగులు చల్లుకొని ఆడుకున్నారు. అనంతరం శుభ్రం చేసుకునేందుకు దగ్గర్లోని నది వద్దకు వెళ్లారు. వారిలో ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడంతో ప్రాణభయంతో కేకలు వేశారు. మిత్రుల పరిస్థితిని గమనించిన సంజయ్‌ వెంటనే అప్రమత్తమై నీటిలోకి దూకాడు. ఒకరి తరవాత మరొకరుగా ముగ్గురినీ ఒడ్డుకు చేర్చాడు. స్థానికుల సాయంతో అంబులెన్సుకు ఫోను చేశాడు. సీపీఆర్‌ చేయడంతో ఆ ముగ్గురూ తేరుకున్నారు. సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు కనబరిచి ముగ్గురి ప్రాణాలు కాపాడిన సంజయ్‌ పేరు గోవా అంతటా మార్మోగింది. శుక్రవారం ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఈ సాహస బాలుడికి రూ.లక్ష బహుమతిని అందించి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని