వరదలను మింగే ‘స్పాంజ్‌’

తీవ్ర వరదముప్పు ఉన్న నగరాల్లో చెన్నై ఒకటి. ఈ ముప్పు నుంచి బయటపడేందుకు వినూత్న ఆలోచనతో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ముందుకొచ్చింది.

Updated : 24 Jul 2023 05:39 IST

భారీ ఇంకుడు గుంతలతో చెన్నైలో వినూత్న ప్రయోగం
విపత్తులను ఎదుర్కొనేందుకు పార్కుల మాదిరి ఏర్పాట్లు

ఈనాడు, చెన్నై: తీవ్ర వరదముప్పు ఉన్న నగరాల్లో చెన్నై ఒకటి. ఈ ముప్పు నుంచి బయటపడేందుకు వినూత్న ఆలోచనతో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ముందుకొచ్చింది. వరద నీటిని పీల్చి భూమిలోకి పంపే స్పాంజ్‌పార్కుల నిర్మాణానికి ముందుకొచ్చింది. నగరంలోని చాలా ప్రాంతాలు ఏటా ముంపుబారిన పడుతూనే ఉంటాయి. 2015లో వచ్చిన వరద చెన్నైలో వందల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ముప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు నగరవ్యాప్తంగా రూ.7.67 కోట్లతో 57 స్పాంజ్‌ పార్కులను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. వీటిలో నిర్మించే కుంటలు ఒక్కోటి 340 చ.మీ.నుంచి 7 వేల చ.మీ. వైశాల్యంలో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. తొలి ప్రాధాన్యంగా తీవ్ర ప్రభావానికి లోనయ్యే ప్రాంతాలు, అక్కడి భూమిలో నీరింకే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

వరద ఎక్కువైనప్పుడు ఈ నీరు పార్కులకు చేరేలా పైపులను అమర్చుతున్నారు. పార్కు సామర్థ్యాన్ని బట్టి కుంటలను తవ్వుతున్నారు. మధ్యలో ఎక్కువ లోతు ఉంచి చుట్టూ వాలుగా నిర్మిస్తున్నారు. ఓ మోస్తరు, భారీవర్షాల నీరు సైతం ఇందులోకి చేరేలా ఏర్పాట్లున్నాయి. తగినంత స్థలం ఉంటే ఒకటికి మించి కుంటలు తవ్వుతున్నారు. ప్రస్తుతానికి 10 పార్కులను నిర్మించారు. స్థానికులకు ఆహ్లాదకరంగా ఉండేలా వీటిలో మొక్కలనూ పెంచుతున్నారు. నడకబాటను, క్రీడాస్థలాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఏడాది పొడవునా పార్కులు పనికొచ్చేలా చేస్తున్నామని జీసీసీ కమిషనర్‌ జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. వీటివల్ల వరదముప్పు తగ్గడంతోపాటు భూగర్భజలాలు పెరిగే అవకాశాలున్నాయని వెల్లడిస్తున్నారు. కుంటల్లో నీరు చేరితే అపరిశుభ్ర పరిస్థితులు తలెత్తకుండా.. దోమల ఉద్ధృతి పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పార్కులను సంరక్షించేందుకు స్థానిక రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లనూ భాగస్వాములను చేస్తున్నారు.

వరద కాలువలకు అనుసంధానం

వరద ముప్పు నుంచి నగరాన్ని బయటపడేసేందుకు భారీగా వరదనీటి కాలువలను కార్పొరేషన్‌ నిర్మిస్తోంది. రెండేళ్లలో రెండు విడతలుగా 715.68 కి.మీ. మేర కాలువలు నిర్మించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 106 రోడ్లలో 45 కి.మీ. వరద కాలువలను నిర్మించారు. ఈశాన్య రుతుపవనాలు వచ్చేలోపు మరో 108 రోడ్ల వెంట 23 కి.మీ. కాలువలను నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నారు. స్పాంజి పార్కుల్లో వరద ఎక్కువైనప్పుడు అక్కడికొచ్చే అదనపు నీటిని ఈ కాలువల్లోకి మళ్లిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని