పంద్రాగస్టు వేడుకలకు సామాన్యులే అతిథులు

ప్రధాని మోదీ వరుసగా పదోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చారిత్రక ఎర్రకోటపైనుంచి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

Published : 14 Aug 2023 04:16 IST

వేర్వేరు రంగాలకు చెందిన 1,800 మందికి ఆహ్వానం
దిల్లీలో కట్టుదిట్టంగా భద్రత
పదోసారి జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: ప్రధాని మోదీ వరుసగా పదోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చారిత్రక ఎర్రకోటపైనుంచి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు ఈ స్వాతంత్య్ర దినోత్సవంతో ముగుస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న మోదీ భావన ప్రకారం దేశం నలుమూలల నుంచి వివిధ వర్గాలకు చెందిన 1,800 మంది దంపతులను ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. 400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాలవారు, 50 మంది చొప్పున పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి/ పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన లబ్ధిదారులు, సెంట్రల్‌ విస్టా, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, హర్‌ఘర్‌ జల్‌ యోజన నిర్మాణ కార్మికులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. వారివారి సంప్రదాయ దుస్తుల్లో స్వాతంత్య్రోత్సవాల్లో పాల్గొనడానికి ప్రతి రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతులను ఆహ్వానించారు.

స్వీయచిత్రాలు తీసుకోవచ్చు

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలతో ముడిపడిన స్వీయచిత్రాలు (సెల్ఫీలు) తీసుకోవడానికి వీలుగా జాతీయ యుద్ధ స్మారక కేంద్రం, ఇండియా గేట్‌, విజయ్‌చౌక్‌, న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌, ప్రగతిమైదాన్‌, రాజ్‌ఘాట్‌, కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రత్యేక సెల్ఫీపాయింట్లు ఏర్పాటుచేశారు. భారత్‌ పట్ల ప్రపంచం పెట్టుకున్న ఆశలు, వ్యాక్సిన్‌ విజయాలు, యోగా, ఉజ్వల యోజన, అంతరిక్ష రంగంలో మన సత్తా, డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌ వంటి పథకాలు/ఇతివృత్తాలను ఇందుకోసం ఎంచుకున్నారు. మైగవ్‌ పోర్టల్‌లో ఆగస్టు 15-20 మధ్య ఆన్‌లైన్‌ సెల్ఫీ పోటీలను రక్షణశాఖ నిర్వహిస్తుంది. ప్రజలెవరైనా 12 ప్రసిద్ధ కేంద్రాల వద్ద  తీసుకున్న ఒకటి, అంతకుమించిన సెల్ఫీలు అప్‌లోడ్‌చేస్తే అందులో ప్రతి కేంద్రం నుంచి 12 మంది విజేతలను ఎంపికచేసి, వారికి రూ.10వేల చొప్పున నగదు బహుమతి అందిస్తారు.

10 వేల మంది పోలీసులతో భద్రత

వేడుకలకు దాదాపు 10వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ముఖ గుర్తింపు కెమెరాలు వెయ్యి అమర్చారు. డ్రోన్లను కూల్చివేసే వ్యవస్థల్ని రంగంలో దించారు. హరియాణాలో ఇటీవలి అల్లర్ల దృష్ట్యా నిఘాను పరిపుష్టం చేశారు.  వేడుకలు జరిగే సమయంలో దిల్లీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించనున్నారు. 


డీపీలు మారుద్దాం: ప్రధాని

స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ప్రజలంతా తప్పకుండా తమ సామాజిక మాధ్యమాల డీపీగా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని కోరారు. దేశానికి, ప్రజలకు మధ్య బంధం పెరగడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన కూడా ఆ మేరకు మార్పు చేసుకున్నారు. వేడుకల సందర్భంగా ఆకాశవాణి, దూరదర్శన్‌ ఛానళ్ల ద్వారా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం రాత్రి 7 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.


తివాచీపై దేశ చిత్రపటం

పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని కశ్మీర్‌లోని మారుమూల గ్రామానికి  చెందిన మహమ్మద్‌ మక్బూల్‌దర్‌ (35) అనే కళాకారుడు భారతదేశ చిత్రపటాన్ని జాతీయ పతాకం రంగుల్లో తివాచీపై తీర్చిదిద్దారు. శ్రమశక్తిపై ప్రేమకు ప్రతీకగా దానిని పార్లమెంటు భవనంలో ప్రదర్శించాలని ఆయన కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని