Anurag Thakur: అసెంబ్లీ ఎన్నికల్ని ముందుకు జరపం

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ స్పష్టం చేశారు.

Updated : 28 Oct 2023 15:44 IST

గడువు ప్రకారమే అవి జరుగుతాయి
సార్వత్రిక ఎన్నికలతో కలపం
కేంద్ర మంత్రి అనురాగ్‌ స్పష్టీకరణ

దిల్లీ: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో వాటిపై ఈ మేరకు స్పష్టతనిచ్చారు. త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరిపి, లేదా ఆలస్యం చేసి.. లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారు. పదవీకాలం చివరిరోజు వరకు ప్రజలకు సేవ చేయాలని మోదీ భావిస్తున్నారని ఒక ఆంగ్ల టీవీ ఛానల్‌ ప్రత్యేక ముఖాముఖిలో చెప్పారు. ఎన్నికలు ముందుగా లేదా ఆలస్యంగా జరుగుతాయని ప్రసార మాధ్యమాల్లో వస్తున్నవి ఊహాగానాలేనని తోసిపుచ్చుతూనే.. జమిలి ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నేతలకు ప్రజాస్వామ్యయుత చర్చలపై నమ్మకం లేదు కాబట్టే కమిటీ నుంచి వైదొలిగారని చెప్పారు.

కలిపి నిర్వహిస్తే నష్టమేంటి?

జమిలి ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే నష్టం ఏమిటని ఠాకుర్‌ ప్రశ్నించారు. ఏకకాలంలో ఎన్నికలు జరగడం వల్ల ఆదా అయిన సమయాన్ని, డబ్బును పేద ప్రజల అభివృద్ధికి, వారి సంక్షేమానికి కేటాయించొచ్చని చెప్పారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపారు. కేంద్రం నియమించిన కమిటీలో ప్రతిపక్ష నేతలకు సైతం చోటు కల్పించి, వారి అభిప్రాయాలను వెల్లడించే వీలు కల్పించామన్నారు. ప్రభుత్వ విశాల హృదయాన్ని అది చాటుతోందని చెప్పారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ కోసం ఏర్పాటైన కమిటీ.. దాని విధివిధానాలను రూపొందించడంలో అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చలు జరుపుతుందని చెప్పారు.

విమర్శలు చేస్తారు.. పారిపోతారు

విమర్శలు చేసి పారిపోవడమే ప్రతిపక్షాల నైజమని ఠాకూర్‌ ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలే అందుకు నిదర్శనమన్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానానికి ప్రతీకగా జీఎస్టీ తీసుకురావాలని చూసిన సందర్భంలోనూ ప్రతిపక్షాలు ఇలాగే గగ్గోలు పెట్టాయని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని