India Or Bharat: ఇండియా స్థానంలో భారత్‌!

జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ నేతలకు రాష్ట్రపతి పంపిన విందు ఆహ్వాన పత్రంలో ఇండియా స్థానంలో భారత్‌ అని పేర్కొనడం, విదేశీ అతిథులకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్‌ అని ముద్రించడం కలకలం రేపింది.

Updated : 06 Sep 2023 09:47 IST

జీ20 నేతల విందు ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని పేర్కొన్న రాష్ట్రపతి కార్యాలయం  
కేంద్ర ప్రభుత్వం విదేశీ అతిథులకిచ్చిన పుస్తకాల్లోనూ అదే తరహాలో..
మార్పునకు సంకేతమన్న అస్సాం సీఎం
దుమ్మెత్తిపోసిన ప్రతిపక్షాలు
తమ కూటమికి ‘ఇండియా’ పేరు ఉండడం వల్లేనని ధ్వజం

ఈనాడు, దిల్లీ: జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ నేతలకు రాష్ట్రపతి పంపిన విందు ఆహ్వాన పత్రంలో ఇండియా స్థానంలో భారత్‌ అని పేర్కొనడం, విదేశీ అతిథులకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్‌ అని ముద్రించడం కలకలం రేపింది. ఈ నెల 9వ తేదీన జీ20 దేశాధినేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ పేరుతో ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వాన పత్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని ట్యాగ్‌ చేశారు. ‘జనగణమన అధినాయక జయహే.. భారత భాగ్య విధాత’ అని మంత్రి ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ఇది వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా మండిపడ్డాయి. ఎప్పటి నుంచో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ‘ఇండియా’ పేరును కాదని భారత్‌గా పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించాయి. ఈ విమర్శలను అధికార భాజపా తిప్పికొట్టింది. పురాణాల నుంచి భారత్‌ అనే పేరుందని, రాజ్యాంగంలోనూ భారత్‌ అనే పేరు ఉందని స్పష్టం చేసింది. బ్రిటిషర్లే ఇండియా అని పిలిచారని పేర్కొంది. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ దేశాన్ని భారత్‌ అని పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

భాగవత్‌ సంకేతమిచ్చారా?

కేంద్ర ప్రభుత్వం భారత్‌ అనే పేరును ఉపయోగించడానికి సిద్ధమైందన్న వాదనలకు ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఇచ్చిన పిలుపు, తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. ఇటీవల గువాహటిలో భాగవత్‌ మాట్లాడుతూ.. ఇండియాకు బదులుగా భారత్‌ అని పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంగ్లీషు మాట్లాడేవారు అర్థం చేసుకోవడానికి ఇండియాగా పిలిచేవారని, తర్వాత అదే అలవాటుగా మారిందని, ఇప్పుడు ఆ పేరును మానేయాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్‌గానే వినిపించాలని, మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు ఇదే ఉండాలని కోరారు. రాష్ట్రపతి ఆహ్వాన పత్రాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్వాగతించారు. ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌ ద్వారా మన నాగరిక సమాజం అమృత కాలంవైపు ధైర్యంగా ముందడుగు వేయడం సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇండోనేషియా పర్యటనకు వెళ్తున్న ప్రధాని గురించి ట్వీట్‌ చేస్తూ ‘ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’ అని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదే తొలిసారి..

అధికార ఆహ్వాన పత్రాల్లో ఇలా భారత్‌ అని పేర్కొనడం ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులు భారత్‌ అని ముద్రించింది. ఇండియా జీ20 సదస్సుకు నాయకత్వం వహించడాన్ని గుర్తు చేస్తూ ‘భారత్‌, ద మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’గా పేర్కొంది. ఇక్కడ వేల ఏళ్ల నుంచి ప్రజాస్వామ్య విలువలు నెలకొన్నట్లు తెలిపింది. భారత్‌గా పిలుచుకునే ఇండియా చరిత్ర తొలినాళ్ల నుంచీ పరిపాలనలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం అంతర్భాగంగా మారినట్లు పేర్కొంది.

‘ప్రత్యేక తీర్మానం అవసరం లేదు’

రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్‌, భారత్‌ అంటే ఇండియా అని ఉన్నందున దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని, దీని కోసం తీర్మానం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మంగళవారం విలేకరులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ట్విటర్‌లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘భారత్‌గా పిలిచేందుకు రాజ్యాంగపరంగా ఎలాంటి అభ్యంతరం లేదు. దేశానికి ఉన్న రెండు అధికారిక నామాల్లో అదీ ఒకటి. అయితే శతాబ్దాలుగా లెక్కలేనంత బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఇండియా పేరును పూర్తిగా విస్మరించేంత తెలివి తక్కువగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చారిత్రకంగా గుర్తింపు పొందిన పేరును వదులుకోవడానికి బదులు రెండు పేర్లను కొనసాగించడం మేలు’ అని పేర్కొన్నారు.

మా కూటమికి ‘ఇండియా’ పేరువల్లే: ప్రతిపక్షాలు

రాష్ట్రపతి ఆహ్వాన పత్రంలో భారత్‌ అని పేర్కొనడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంవల్లే భాజపా ఇలా వ్యవహరించిందని విమర్శించాయి. ‘రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాన్ని బట్టి ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ఇక మీదట భారత్‌, దట్‌ వాజ్‌ ఇండియా, షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ అని చదువుకోవాలి. కానీ ఇప్పుడు ఈ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ దాడికి గురవుతున్నాయి’ అని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 52లో ‘దేర్‌ షల్‌ బీ ఏ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఉంది.. ఇంతకు మించి చెప్పడానికి ఇంకేమీ లేదని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ ట్వీట్‌ చేశారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంవల్లే కేంద్ర ప్రభుత్వం భారత్‌ను వాడటానికి ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ‘ఈ దేశం 140 కోట్ల మంది ప్రజలది తప్పితే ఒక పార్టీది కాదు. ఒకవేళ రేప్పొద్దున ప్రతిపక్ష కూటమి ఇండియా తన పేరును భారత్‌గా మార్చుకుంటే ఆ పేరునూ వాడకుండా ఉంటారా? ఇదేం తమాషా? ప్రతిపక్ష కూటమికి ఓట్లు పడతాయేమోనన్న భయంతో ఇలా చేయడమంటే దేశానికి ద్రోహం చేయడమే’ అని ధ్వజమెత్తారు.

పార్లమెంటులో తీర్మానం చేస్తారా?

వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం భారత్‌గా పేర్కొంటూ తీర్మానం చేయబోతోందని ఆంగ్ల ప్రసార మాధ్యమాలు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. జులై 18న బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కూటమి పేరును ‘ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయెన్స్‌గా (ఇండియా)’ నామకరణం చేసిన నాటి నుంచి దానిపై చర్చ ప్రారంభమైంది. తాజాగా ముంబయిలో ఆగస్టు 31, సెప్టెంబరు 1న జరిగిన కూటమి సమావేశంలో ‘జుడేగా భారత్‌.. జీతేగా ఇండియా’ అనే నినాదాన్ని ఖరారు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆహ్వాన పత్రంలో ఇండియాకు బదులు భారత్‌ ఉన్నట్లు వెలుగులోకి రావడంతో చర్చ మొదలైంది.

  • ఇండియా, భారత్‌ అనేవి మనందరికీ తెలుసని, ప్రపంచానికి ఇండియా అనే తెలుసని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
  • ప్రతిపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టడంవల్లే భాజపా సర్కారు దేశాన్ని ‘భారత్‌’గా పిలిచేందుకు ప్రయత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శించారు.
  • దేశం పేరును మార్చే అధికారం ఏ ఒక్కరికీ లేదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు.

రాజ్యాంగంలో రెండూ..

సాధారణ ప్రజల భాషలో భారత దేశాన్ని భారత్‌, ఇండియాగా పిలుచుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ‘ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌, షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని ఉంది. ఆర్టికల్‌ 52లో రాష్ట్రపతిని ‘ద ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ అని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి అధికారిక ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని పేర్కొనడంతో కేంద్రం రాజ్యాంగంలో ఇప్పటివరకు వాడుతున్న ఇండియా స్థానంలో భారత్‌ను వాడేందుకు సిద్ధమైనట్లు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.


‘భారత్‌ మాతాకీ జై’ అంటూ అమితాబ్‌ ట్వీట్‌

చర్చనీయాంశంగా మారిన వైనం

ముంబయి: బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మంగళవారం చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన ‘భారత్‌ మాతాకీ జై’ అని ట్విటర్‌లో పోస్టు చేశారు. దేశం పేరును ‘ఇండియా’గా కాకుండా.. ‘భారత్‌’గా సంబోధిస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఆయనకు మద్దతు పలకగా.. మరి కొందరు ‘‘జయా జీ అంటే మీకు భయం లేదా’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని