Justice Madan B Lokur: నెలల తరబడి జైళ్లలో ఉంచడం అత్యంత దురదృష్టకరం

బెయిల్‌ మంజూరు, లేదా తిరస్కరణపై మూల సిద్ధాంతాలను న్యాయస్థానాలు మరిచిపోతున్నట్లున్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 08 Nov 2023 16:25 IST

బెయిల్‌ మూల సిద్ధాంతాల్ని కోర్టులు మరిచిపోతున్నాయి
దర్యాప్తు సంస్థల దుర్బుద్ధిని గుర్తించడం లేదు
పీటీఐ ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ వ్యాఖ్యలు

దిల్లీ: బెయిల్‌ మంజూరు, లేదా తిరస్కరణపై మూల సిద్ధాంతాలను న్యాయస్థానాలు మరిచిపోతున్నట్లున్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌(Justice Madan B Lokur) అభిప్రాయపడ్డారు. నిందితులను కారాగారంలో ఉంచాలనే ఉద్దేశంతో దర్యాప్తు సంస్థలు చేసే ప్రయత్నాలను గుర్తించేందుకు న్యాయవ్యవస్థ సుముఖంగా లేకపోవడం ‘అత్యంత దురదృష్టకరం’ అని అన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఈ-మెయిల్‌ ఇంటర్వ్యూలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి అరెస్టయితే కనీసం కొన్ని నెలలపాటు జైల్లో ఉండాల్సి రావడం ఖాయమని అన్నారు.

‘పోలీసులు మొదట ఒక వ్యక్తిని అరెస్టు చేస్తారు. ఆ తర్వాత సీరియస్‌గా దర్యాప్తు మొదలుపెడతారు. దర్యాప్తు సంస్థలు అరకొర వివరాలతో ఛార్జిషీటు వేసి, తర్వాత అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేస్తాయి. ఈ కోణాన్ని కొన్ని కోర్టులు చూడడం లేదు. న్యాయశాస్త్ర పుస్తకాలు ఇలాంటి మొత్తం కథను చెప్పవు. ఈ సత్యాలను న్యాయవ్యవస్థ గుర్తెరగాలి’ అని జస్టిస్‌ లోకుర్‌ చెప్పారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తమ దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బెయిల్‌ విషయాల్లో విచక్షణాధికారాలను ఎలా వినియోగించుకోవాలనే ప్రాథమిక సూత్రాలను నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పులు వెలువరించిందని గుర్తుచేశారు. ఈ విషయం తెలిసినా కొన్ని కోర్టులు వాటిని పాటించడం లేదని, అది ఎందుకనేదే ప్రశ్న అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని