నగరాల్లో సరకు రవాణాకు సులువైన యాప్‌

నగరాల్లో సరకులను మరింత సమర్థంగా, సులువుగా రవాణా చేయడానికి మద్రాస్‌ ఐఐటీ పరిశోధకులు ఒక మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేశారు.

Published : 14 Nov 2023 05:06 IST

ఐఐటీ పరిశోధకుల ఘనత

దిల్లీ: నగరాల్లో సరకులను మరింత సమర్థంగా, సులువుగా రవాణా చేయడానికి మద్రాస్‌ ఐఐటీ పరిశోధకులు ఒక మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇది మధ్యవర్తుల ప్రమేయానికి అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. ‘ఆప్ట్‌రూట్‌’ అనే ఈ యాప్‌.. డ్రైవర్‌తో వినియోగదారుడిని అనుసంధానిస్తుంది. ఈ లావాదేవీల్లో కమీషన్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. చెల్లింపులు కూడా వినియోగదారుడి నుంచి నేరుగా డ్రైవర్‌కు వెళతాయి. ఈ యాప్‌నకు సంబంధించిన మొదటి వెర్షన్‌.. మద్రాస్‌ ఐఐటీలో ఏర్పాటైన ఆప్ట్‌రూట్‌ లాజిస్టిక్స్‌ అనే అంకురపరిశ్రమ అభివృద్ధి చేసి, వాణిజ్య ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చింది. ‘‘సరకు రవాణా విషయంలో డ్రైవర్లు, వినియోగదారులకు మధ్య ఉన్న సంధానత సమస్యను ఈ యాప్‌ పరిష్కరిస్తుంది. తిరుగుప్రయాణంలో లోడ్‌ లేకపోవడం, వాహనం పూర్తి సామర్థ్యంతో తిరగకపోవడం వంటి సమస్యలను ప్రస్తుతం రవాణాదారులు ఎదుర్కొంటున్నారు. ఈ రంగంలోని మార్కెట్‌ వ్యవస్థీకృతంగా, సమర్థంగా కూడా లేదు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఇబ్బందులను పరిష్కరించొచ్చు’’ అని మద్రాస్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ ఎన్‌.ఎస్‌.నారాయణస్వామి తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్‌ సేవలను హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై సహా దేశంలోని పలు నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని