మౌలిక వసతుల విస్తరణతోనే అందరికీ చేరువగా న్యాయం

ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు.

Published : 28 Nov 2023 04:35 IST

 సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వెల్లడి

దిల్లీ: ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయ సహాయ సేవలను విస్తృతపరచడం వంటి పాలనాపరమైన చర్యల్లో పురోగతి కూడా దీనికి అవసరమేనని స్పష్టం చేశారు. జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) సోమవారం దిల్లీలో ‘అందరికీ చేరువలోకి న్యాయ సేవలు’ అనే అంశంపై నిర్వహించిన తొలి ప్రాంతీయ సదస్సులో సీజేఐ ప్రసంగించారు. మన దేశంలో వెనుకబడిన వర్గాలకు కోర్టులు అందుబాటులో ఉండాలంటే న్యాయ సేవలను విస్తరించడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ ఉపయోగించుకోవాలన్నారు. ఇక అంతర్జాతీయ సంబంధాల వ్యవహారాల్లోకి వస్తే....పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు (గ్లోబల్‌ నార్త్‌), అభివృద్ధిలో వెనుకబడిన దేశాల (గ్లోబల్‌ సౌత్‌) మధ్య మానవ హక్కుల విషయంలో వ్యత్యాసం కనిపిస్తోందని, చర్చలు, సంప్రదింపులు, భాగస్వామ్యం వంటి అంశాల్లో ఇది మరింత ప్రస్ఫుటం అవుతోందన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని ఆర్థిక, వాణిజ్య రంగాలకే పరిమితం చేయకుండా న్యాయ వ్యవస్థలకూ విస్తరించుకోవాల్సిన ఆవశ్యకతను జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు. అందుకు ఈ ప్రాంతీయ సదస్సు దోహదపడాలని ఆకాంక్షించారు. సదస్సులో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి తదితరులు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని