గవర్నర్‌ ఏడీసీగా తొలిసారిగా మహిళ

దేశంలో గవర్నర్‌ ఏడీసీ (ఎయిడ్‌ ది క్యాంప్‌)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 2015 బ్యాచ్‌కు చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ మనీషా పాఢిని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు బుధవారం ఉత్తర్వులిచ్చారు.

Published : 30 Nov 2023 05:24 IST

నియమించిన మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు

ఈనాడు, దిల్లీ: దేశంలో గవర్నర్‌ ఏడీసీ (ఎయిడ్‌ ది క్యాంప్‌)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 2015 బ్యాచ్‌కు చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ మనీషా పాఢిని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు బుధవారం ఉత్తర్వులిచ్చారు. త్రివిధ దళాలకు చెందిన ఒక అధికారిని ఏడీసీగా నియమించుకునే అధికారం దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లకు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్యానల్‌ను ఆయా దళాలు ప్రతిపాదిస్తాయి. ఇందులోంచి ఇష్టం వచ్చిన వారిని నియమించుకునే స్వేచ్ఛ గవర్నర్లకు ఉంటుంది. తాజాగా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అందులో నుంచి మనీషా పాఢిని ఎంపిక చేశారు. ‘ఆమె నియామకం ఒక మైలురాయే కాకుండా లింగభేదాలను చెరిపేస్తూ మహిళలు గతంలో ఎన్నడూ అడుగుపెట్టని రంగాల్లో ప్రవేశిస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ. మహిళాశక్తికి నిదర్శనం. ఈ అరుదైన సందర్భాన్ని గుర్తుంచుకోవడంతోపాటు ప్రతి రంగంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేయడానికి ప్రయత్నించాలి’ అని ఈ సందర్భంగా హరిబాబు పిలుపునిచ్చారు. గవర్నర్‌ ఏడీసీగా బుధవారం బాధ్యతలు చేపట్టిన మనీషా.. గతంలో బీదర్‌, పుణె, భటిండాల్లోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లలో స్క్వాడ్రన్‌ లీడర్‌గా పనిచేశారు. ప్రతి గవర్నర్‌కు ఇద్దరు ఏడీసీలు ఉంటారు. ఇందులో ఒకరు త్రివిధ దళాలకు చెందినవారు కాగా.. మరొకరు సంబంధిత రాష్ట్ర పోలీసు విభాగం నుంచి వస్తారు. గవర్నర్‌ విధి నిర్వహణలో కీలక భూమిక పోషించే వారు.. నిరంతరం ఆయన వెంటే ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని