విమానంలో భార్యాభర్తల గొడవ.. దారి మళ్లించి దిల్లీలో దించివేత

బ్యాంకాక్‌కు బయలుదేరిన మ్యూనిక్‌ - బ్యాంకాక్‌ ‘లుఫ్తాన్సా’ విమానాన్ని బుధవారం దారి మళ్లించి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు.

Published : 30 Nov 2023 05:24 IST

దిల్లీ: బ్యాంకాక్‌కు బయలుదేరిన మ్యూనిక్‌ - బ్యాంకాక్‌ ‘లుఫ్తాన్సా’ విమానాన్ని బుధవారం దారి మళ్లించి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. భార్యాభర్తలైన ఓ జంట పరస్పరం గొడవపడి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం ఈ పరిస్థితికి దారి తీసింది. దిల్లీలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)ను సంప్రదించిన ఎల్‌హెచ్‌772 లుఫ్తాన్సా పైలట్లు పరిస్థితిని వివరించి, ల్యాండింగుకు అనుమతి కోరారు. అధికారులు అనుమతించిన వెంటనే ఉదయం 10.26 గంటలకు ఆ విమానం దిల్లీలో దిగింది. అంతకుముందు విమానం జర్మనీలోని మ్యూనిక్‌ నుంచి బయలుదేరాక.. జర్మన్‌ అయిన భర్త (53), థాయ్‌ మగువ అయిన భార్య మధ్య వాగ్వాదం మొదలైంది. తన భర్త బెదిరిస్తున్నట్లుగా ఆమె పైలట్‌ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసి, జోక్యం చేసుకోవాలని కోరింది. కోపంతో రెచ్చిపోయిన భర్త ఆమెపైకి ఆహారం విసిరేసి, లైటర్‌తో దుప్పటిని అంటించేందుకు ప్రయత్నించాడు.   ఇక లాభం లేదని విమానాన్ని దారి మళ్లించి దిల్లీలో దింపారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు దంపతులను కిందికి దించాయి. ప్రత్యేక పీఎన్‌ఆర్‌ టికెటు ఉన్న భార్య బ్యాంకాక్‌ ప్రయాణం కొనసాగేలా ‘లుఫ్తాన్సా’ అధికారులు అనుమతించడంతో గంటకు పైగా ఆలస్యంగా ఆ విమానం తిరిగి బయలుదేరింది. భర్త క్షమాపణను పరిగణనలోకి తీసుకొని ఎయిరిండియా విమానంలో బ్యాంకాక్‌ వెళ్లేందుకు టికెటు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని