సొరంగం నుంచి కుమారుడు బయటకు రావడానికి కొన్ని గంటల ముందే తండ్రి మరణం

సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న తన కుమారుడి కోసం 16 రోజులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఓ తండ్రి.. చివరకు తన బిడ్డ బయటకు రావడానికి కొన్ని గంటల ముందు కన్నుమూసిన హృదయ విదారక ఘటన ఇది.

Published : 30 Nov 2023 05:06 IST

ఉత్తర్‌కాశీ: సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న తన కుమారుడి కోసం 16 రోజులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఓ తండ్రి.. చివరకు తన బిడ్డ బయటకు రావడానికి కొన్ని గంటల ముందు కన్నుమూసిన హృదయ విదారక ఘటన ఇది. సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల్లో ఝార్ఘండ్‌లోని బాంకిసోల్‌ గ్రామానికి చెందిన 29 ఏళ్ల భక్తు ముర్ము కూడా ఉన్నాడు. భక్తు క్షేమంగా తిరిగి రావాలని అతడి కుటుంబం అనేక ప్రార్థనలు చేసింది. రోజులు గడుస్తున్నా కుమారుడు బయటకు రాకపోవడంతో అతడి తండ్రి బాసెత్‌ ముర్ము (70) తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉన్నట్టుండి మంచం మీద నుంచి అతడు కిందపడ్డాడు. అదే సమయంలో గుండెపోటు రావడంతో మృతిచెందాడు.

‘హత్తుకొని.. భుజాలపై ఎత్తుకున్నారు’

తమను చూసిన వెంటనే సొరంగంలోని కార్మికులు సంతోషంలో మునిగిపోయారని.. వారి వద్దకు తొలుత చేరుకున్న ర్యాట్‌హోల్‌ మైనింగ్‌ నిపుణులు ఫిరోజ్‌ ఖురేషి, మోనూ కుమార్‌ తెలిపారు. తమను వారు హత్తుకొని, భుజాలపై ఎత్తుకున్నారని చెప్పారు. చివరి దశ సహాయక చర్యల్లో పాల్గొన్న రాక్‌వెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన 12 మంది సభ్యుల బృందంలో ఫిరోజ్‌, మోనూ సభ్యులు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా నాలుగు రోజుల కిందట ఓ కంపెనీ తమను కోరిందని ఆ బృంద నాయకుడు వకీల్‌ హసన్‌ తెలిపారు. పని పూర్తి చేసినందుకు తాము డబ్బు తీసుకోబోమని స్పష్టం చేశారు.

లైవ్‌ చూస్తూ ప్రధాని భావోద్వేగం

కేబినెట్‌ సమావేశం జరుగుతుండగానే మంగళవారం రాత్రి సిల్‌క్యారా సొరంగం వద్ద తుది దశ సహాయక చర్యలు కొనసాగాయి. అక్కడి కార్యకలాపాలను ప్రధాని మోదీ సహా కేబినెట్‌ మంత్రులంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చినప్పుడు, మంత్రివర్గ సమావేశంలో వారి గురించి చర్చ జరిగినప్పుడు ప్రధాని చాలా భావోద్వేగానికి లోనయ్యారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా సిల్‌క్యారా సొరంగం కూలినప్పటికీ.. ప్రతిష్ఠాత్మక చార్‌ధామ్‌ యాత్ర మార్గం ప్రాజెక్టు నిలిచిపోదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు