శ్రీనగర్‌ నిట్‌లో సోషల్‌ మీడియా దుమారం

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా  కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Published : 01 Dec 2023 06:41 IST

ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా  కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల విద్యార్థుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ఎన్‌ఐటీ అధికారులు పది రోజులు ముందే శీతాకాల సెలవులు ప్రకటించి హాస్టళ్లను ఖాళీ చేయిస్తున్నారు. వెంటనే గదులు ఖాళీ చేయాల్సిందిగా డీన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికేతర విద్యార్థులు 15 వాహనాల్లో భద్రతా సిబ్బంది ఎస్కార్టు నడుమ తమ తమ రాష్ట్రాల ప్రయాణ నిమిత్తం తరలివెళ్లారు. పరీక్షలను వాయిదా వేసి, ఉన్నపళంగా తీసుకున్న సెలవుల నిర్ణయంతో ఇక్కడ చదువుతున్న సుమారు 300 మంది తెలుగు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్‌ నుంచి అత్యవసరంగా బయలుదేరేందుకు విమానాలు, రైలు సదుపాయం లేకపోవడంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను వారు కోరుతున్నారు. అభ్యంతరకరంగా ఉన్న ఆ పోస్టు ఇతర విద్యాసంస్థలకు కూడా ప్రబలడంతో స్థానిక ‘ది ఇస్లామియా కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కామర్స్‌’ తరగతులతోపాటు అంతర్గత పరీక్షలను రద్దు చేసింది. మరికొన్ని కళాశాలల్లో ‘పోస్టు’కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. నిట్‌ వెబ్‌సైటును తాత్కాలికంగా నిలిపివేశారు. ఇరు వర్గాల నడుమ చిచ్చు పెట్టేలా యూట్యూబ్‌ వీడియోను పోస్టు చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించినట్లు కశ్మీర్‌ ఐజీ వి.కె.బిర్దీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని