తీవ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు

మణిపుర్‌లోని తెంగ్నౌపాల్‌ జిల్లాలో సోమవారం రెండు తీవ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

Updated : 05 Dec 2023 05:27 IST

మణిపుర్‌లో 13 మంది పీఎల్‌ఏ సభ్యుల మృతి

ఇంఫాల్‌: మణిపుర్‌లోని తెంగ్నౌపాల్‌ జిల్లాలో సోమవారం రెండు తీవ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నిషేధిత పీఎల్‌ఏ తీవ్రవాద సంస్థకు చెందిన 13 మంది సభ్యులు ఈ ఘటనలో మరణించారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే మయన్మార్‌ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలోని లీతు గ్రామానికి ప్రత్యేక బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. అక్కడ 13 మృతదేహాలు కనిపించాయి. ఆ మృతదేహాలను పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) సంస్థకు చెందిన సభ్యులవిగా అధికారులు గుర్తించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పీఎల్‌ఏపై గతంలోనే నిషేధం విధించగా ఇటీవలే పొడిగించారు. మృతదేహాల సమీపంలో ఎలాంటి ఆయుధాలు, మందుగుండు దొరకలేదని అధికారులు తెలిపారు. ‘‘సోమవారం తెంగ్నౌపాల్‌ జిల్లాలోని లీతు గ్రామ సమీపం నుంచి ఓ తీవ్రవాద గ్రూపు బృందం మయన్మార్‌ వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న మరో గ్రూపు సభ్యులు వారిపై కాల్పులు జరిపారు. ప్రతిగా అవతలి వర్గం కూడా కాల్పులు ప్రారంభించింది. ఈ క్రమంలో 13 మంది మృతి చెందారు’’ అని ఓ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని