రెండు ఆరోపణల్లోనూ రాఘవ చడ్డా దోషే

తప్పుదోవ పట్టించే విషయాలను మీడియాకు అందించిన అంశంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డాను రాజ్యసభ హక్కుల కమిటీ దోషిగా నిర్ధారించింది.

Updated : 05 Dec 2023 04:40 IST

స్పష్టీకరించిన రాజ్యసభ హక్కుల కమిటీ నివేదిక
గతంలో విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేత

దిల్లీ: తప్పుదోవ పట్టించే విషయాలను మీడియాకు అందించిన అంశంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డాను రాజ్యసభ హక్కుల కమిటీ దోషిగా నిర్ధారించింది. అలాగే ప్రతిపాదిత సెలెక్ట్‌ కమిటీకి సభ్యుల అంగీకారం లేకుండానే వారిపేర్లను జాబితాలో చూపించిన విషయంలోనూ దోషిగా తేల్చింది. దీనికి సంబంధించిన నివేదికను సోమవారం రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించింది. మరోపక్క భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించడం ద్వారా చడ్డా మీద విధించిన సస్పెన్షన్‌ వేటును రాజ్యసభ ఎత్తేసింది. ఆయన సభకు హాజరయ్యేందుకు ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనుమతించారు. తాజా పరిణామంతో 115 రోజుల తర్వాత ఆయన మళ్లీ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. రాఘవ్‌ చడ్డాను ఈ ఏడాది ఆగస్టు 11న రాజ్యసభ నుంచి నిరవధికంగా సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. హక్కుల కమిటీ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. ‘‘రెండు అభియోగాల్లో చడ్డా దోషిగా తేలారు. ఒకటి.. ఆయన ఉద్దేశపూర్వకంగా మీడియాకు తప్పుదోవ పట్టించే సమాచారమిచ్చారని కమిటీ గుర్తించింది. రెండోది..దిల్లీ బిల్లుకు సంబంధించిన ప్రతిపాదిత కమిటీలో కొందరు ఎంపీల పేర్లను వారి సమ్మతి లేకుండానే చేర్చినట్లు తేలింది’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని