100కు పైగా మోసకారి వెబ్‌సైట్ల మూసివేత

చట్టవిరుద్ధ పెట్టుబడులకు మార్గం కల్పించడంతోపాటు పరిమిత కాల ఉద్యోగాల పేరుతో భారత్‌లో అభ్యర్థులను మోసగిస్తున్న 100కు పైగా వెబ్‌సైట్లను మూసివేసినట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది.

Published : 07 Dec 2023 05:26 IST

కేంద్ర హోంశాఖ ప్రకటన

దిల్లీ: చట్టవిరుద్ధ పెట్టుబడులకు మార్గం కల్పించడంతోపాటు పరిమిత కాల ఉద్యోగాల పేరుతో భారత్‌లో అభ్యర్థులను మోసగిస్తున్న 100కు పైగా వెబ్‌సైట్లను మూసివేసినట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. ఈ వెబ్‌సైట్లు అన్నింటినీ విదేశాల నుంచి నడుపుతున్నారు. హోం శాఖకు చెందిన ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సి) ఈ వెబ్‌సైట్లను గుర్తించి, వెంటనే రద్దు చేయాలని సర్కారుకు సూచించింది. ‘సైబర్‌ భద్ర భారతం’ అనే కార్యక్రమం కింద మోసపూరిత వెబ్‌సైట్ల పనిపడుతున్నామని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటి నుంచి పనిచేసే అవకాశం, ఇంట్లో కూర్చొని సంపాదించే మార్గం అంటూ పలు భాషల్లో డిజిటల్‌ వాణిజ్య ప్రకటనలు ఇస్తూ జనం నుంచి డబ్బు దండుకోవడమే ఈ వెబ్‌సైట్ల పని. నిరుద్యోగ యువత, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, గృహిణులకు వాట్సాప్‌, టెలిగ్రామ్‌ల ద్వారా ఎర వేసి మోసం చేస్తున్నారు. మొదట లైక్‌ చేయండి, సబ్‌స్క్రైబ్‌ చేయండి, మ్యాపులకు రేటింగు ఇవ్వండి అంటూ ముగ్గులోకి దించుతారు. కొంతమేర కమీషన్లు ఇచ్చి, తరవాత అధిక రాబడుల కోసం పెట్టుబడి పెట్టాలని ఊరిస్తారు. బాధితులు పెద్ద మొత్తాలను జమ చేసిన తరవాత వాటిని బంద్‌ చేస్తారు. ఇలా దండుకున్న మొత్తాలను కార్డు నెట్‌వర్కులు, క్రిప్టోకరెన్సీ, విదేశాల్లోని ఏటీఎంలు, అంతర్జాతీయ ఫిన్‌టెక్‌ కంపెనీల ద్వారా మోసగాళ్లు డ్రా చేసుకుంటారు. ఇటువంటి మోసాలు జరిగిన వెంటనే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌.సి.ఆర్‌.పి)కి ఫిర్యాదు చేయాలని హోంశాఖ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు