అరాచకం సృష్టించాలని కుట్ర

పార్లమెంటులో ఆగంతకుల చొరబాటు ఘటనపై దర్యాప్తులో క్రమంగా కీలక వివరాలు బయటికొస్తున్నాయి. దేశంలో అరాచకం సృష్టించేందుకు నిందితులు కుట్ర పన్నారని.. తద్వారా తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకున్నారని పోలీసులు తాజాగా వెల్లడించారు.

Updated : 16 Dec 2023 06:21 IST

తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని భావించారు
పార్లమెంటులోకి చొరబాటు ఘటనలో నిందితుల ప్రణాళిక ఇదే

దిల్లీ: పార్లమెంటులో ఆగంతకుల చొరబాటు ఘటనపై దర్యాప్తులో క్రమంగా కీలక వివరాలు బయటికొస్తున్నాయి. దేశంలో అరాచకం సృష్టించేందుకు నిందితులు కుట్ర పన్నారని.. తద్వారా తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకున్నారని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝాను తమ కస్టడీకి అప్పగించాలని కోరిన సందర్భంగా దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు పటియాలా హౌజ్‌ కోర్టులో శుక్రవారం పలు వివరాలు వెల్లడించారు. పార్లమెంటులోకి చొరబడే కుట్ర పన్నేందుకు నిందితులు చాలాసార్లు సమావేశమయ్యారని తెలిపారు.

పోలీసుల అదుపులో మరో ఇద్దరు

కేసు దర్యాప్తులో భాగంగా కైలాశ్‌, మహేశ్‌ అనే మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారిని ఇంకా అరెస్టు చేయలేదు. దిల్లీ నుంచి పారిపోయిన అనంతరం రాజస్థాన్‌లో తలదాచుకునేందుకు లలిత్‌కు వారు సహకరించారు. ఆ ఇద్దరిలో ఒకరు రాజస్థాన్‌వాసి. నిజానికి వారిలో ఒకరు పార్లమెంటులోకి చొరబడాలనుకున్నారు. కానీ బుధవారం అక్కడికి చేరుకోలేకపోయారు.

ఫోన్లు తగలబెట్టేశాడు

కోర్టులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పార్లమెంటులో సంచలన ఘటనల అనంతరం దిల్లీ నుంచి రాజస్థాన్‌కు లలిత్‌ పారిపోయాడు. అక్కడ రెండు రోజులు ఉండి.. గురువారం రాత్రి దిల్లీకి తిరిగొచ్చి లొంగిపోయాడు. సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా దిల్లీ-జైపుర్‌ సరిహద్దుకు సమీపంలో తన ఫోన్‌ను పారేశాడు. నలుగురు సహ నిందితుల ఫోన్లను కూడా వెంట తీసుకెళ్లిన అతడు.. వాటిని తగలబెట్టేశాడు. ఫోన్లు లేకపోవడంతో.. నిందితుల కుట్ర ఎప్పుడు ప్రారంభమైందన్నది తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. తన ఫోన్‌ను పారేసిన, ఇతరుల ఫోన్లను కాల్చేసిన ప్రాంతాలకు లలిత్‌ను వారు తీసుకెళ్లనున్నారు.

ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా..

పార్లమెంటు ఆవరణలో అలజడి సృష్టించేందుకు నిందితులు ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ప్లాన్‌-ఎ ప్రకారం.. నీలం, అమోల్‌ శిందే పార్లమెంటుకు చేరుకొని నిరసన తెలియజేయాలి. ప్లాన్‌-బి ప్రకారం మహేశ్‌, కైలాశ్‌లు మరో మార్గంలో అక్కడికి చేరుకొని మీడియా కెమెరాల ముందు రంగుల పొగగొట్టాలను తెరిచి ఆందోళన చేపట్టాలి. అనుకున్న సమయానికి మహేశ్‌, కైలాశ్‌ గురుగ్రామ్‌ చేరుకోలేకపోవడంతో ‘ప్లాన్‌-ఎ’నే వారు అమలు చేశారు.


లలిత్‌ ఝాకు ఏడు రోజుల పోలీసు కస్టడీ

లలిత్‌ ఝాకు కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అతణ్ని విచారించేందుకు వీలుగా 15 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. 7 రోజులకే అనుమతి లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాగర్‌, మనోరంజన్‌, నీలం, శిందేలకు కూడా కోర్టు గురువారం 7 రోజుల పోలీసు కస్టడీ విధించిన సంగతి గమనార్హం. మరోవైపు- లలిత్‌ ఝా స్నేహితుడైన నీలాక్ష్య ఆయిచ్‌ను పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో పోలీసులు గురువారం కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. ఆయిచ్‌ కళాశాలలో చదువుకుంటున్న అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థి. లోక్‌సభలోకి తన సహ నిందితులు చొరబడిన కొద్దిసేపటికే సంబంధిత వీడియోను లలిత్‌ అతడికి పంపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని