ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నారు..!

పార్లమెంటులో పొగను వెదజల్లి హడావుడి సృష్టించిన వ్యక్తులు మొదట వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆత్మాహుతి నాటకం ఆడాలని భావించారు! లేదంటే కరపత్రాలు విసరాలని అనుకున్నారు.

Updated : 17 Dec 2023 06:59 IST

పార్లమెంటు ఘటనపై వెలుగులోకి మరిన్ని వివరాలు
ఆరో వ్యక్తి కూడా అరెస్టు

దిల్లీ: పార్లమెంటులో పొగను వెదజల్లి హడావుడి సృష్టించిన వ్యక్తులు మొదట వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆత్మాహుతి నాటకం ఆడాలని భావించారు! లేదంటే కరపత్రాలు విసరాలని అనుకున్నారు. చివరకు లోక్‌సభ ఛాంబర్లోకి దూకి రంగుల పొగతో కలకలం సృష్టించే నిర్ణయానికి వచ్చారు. అరెస్టయి తమ కస్టడీలో ఉన్న అయిదుగురు నిందితులు ఈ విషయాన్ని వెల్లడించారని దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగాధికారులు శనివారం తెలిపారు. ‘లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకే ప్రణాళికను ఖరారు చేయడానికి ముందు నిందితులు ప్రభుత్వానికి తమ సందేశాన్ని బలంగా పంపేందుకు ఇతర మార్గాలనూ అన్వేషించారు. శరీరానికి ‘ఫైర్‌ప్రూఫ్‌ జెల్‌’ (నిప్పు నుంచి రక్షణ కల్పించే లేపనాన్ని) పూసుకుని.. నిప్పంటించుకునే యోచన చేశారు. దానివల్ల తమకెలాంటి హాని కలగకుండానే మీడియా దృష్టిని ఆకర్షించి దేశంలో సంచలనం సృష్టించవచ్చని అనుకున్నారు. తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. కారణం తెలియాల్సి ఉంది’ అని వివరించారు. నిందితులకు సందర్శకుల పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్‌ సింహా వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు.

కుమావత్‌కు వారం రోజుల కస్టడీ

దర్యాప్తులో భాగంగా అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిందితులను.. గతంలో వారు కలిసిన, ఈ కుట్రకు ప్రణాళిక రూపొందించిన ప్రాంతాలకు తీసుకువెళ్లారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న లలిత్‌ ఝాను త్వరలో రాజస్థాన్‌లోని నాగౌర్‌కు తీసుకువెళ్లనున్నారు. ఘటనానంతరం ఝా దిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయి ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకడైన మహేశ్‌ కుమావత్‌ను ఏడురోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ దిల్లీలోని న్యాయస్థాన ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. నిందితుల ఫోన్ల విధ్వంసంలో అతని పాత్ర ఉందని, కేసులో మరోవ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పార్లమెంటు సముదాయ భద్రతలో వివిధ కోణాలను సమీక్షించడానికి ఉన్నతస్థాయి సంఘాన్ని నియమించినట్లు ఎంపీలకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఓ లేఖ ద్వారా తెలిపారు. హోంశాఖ నియమించిన కమిటీ నివేదికను త్వరలోనే సభకు తెలియజేస్తామన్నారు. ఎంపీల సస్పెన్షన్‌కు, ఈ నెల 13 నాటి ఘటనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

మనోరంజన్‌ నివాస గది సీజ్‌

పార్లమెంటులో కలకలం కేసులో రెండో నిందితుడైన మనోరంజన్‌ నివాస గదిని పోలీసులు సీజ్‌ చేశారు. దిల్లీతో పాటు కాంబోడియా, బ్యాంకాక్‌ తదితర ప్రాంతాలకు తిరగడానికి అతడికి డబ్బు ఎక్కడినుంచి వస్తోందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అతడి బ్యాంక్‌ ఖాతాలు, ఫోన్‌ పే, గూగుల్‌ పే సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొదటి నిందితుడు సాగర్‌ శర్మ (యూపీ) మైసూరుకు వచ్చి మనోరంజన్‌ను కలిశాడు. వీరిద్దరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అని నిఘా అధికారులు ఆరా తీస్తున్నారు. సన్నివేశాన్ని పునఃసృష్టించడానికి పార్లమెంటు అనుమతి పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

నా కుమారుడు అమాయకుడు: ఝా తండ్రి

దర్భంగా: పార్లమెంటులో దాడికి పాల్పడ్డ ఘటనలో ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న తన కుమారుడు లలిత్‌ ఝా అమాయకుడని అతని తండ్రి దేవానంద్‌ ఝా అంటున్నారు. ‘ట్యూషన్లు చెబుతూ కుటుంబానికి ఆధారంగా లలిత్‌ ఉంటున్నాడు. ఛఠ్‌పూజకు మమ్మల్ని బిహార్‌లోని దర్భంగాకి పంపించి, వ్యక్తిగత పనిమీద దిల్లీ వెళ్తున్నట్లు చెప్పి ఈ నెల 10న రైల్లో బయల్దేరాడు. చివరగా మేం మాట్లాడింది అదే. మా ఇంట్లో టీవీ కూడా లేదు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం ఇతరుల ద్వారా తెలిసింది. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం’ అని వివరించారు. పూర్వీకుల కాలం నాటి శిథిల గృహంలో దేవానంద్‌ నివాసం ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని