Ayodhya: పాత విగ్రహమూ అక్కడే..

ఇన్నాళ్లూ తాత్కాలిక మందిరంలో ఉన్న పాత రామ్‌లల్లా మూర్తి సోమవారం గర్భగుడిలో కొత్తగా ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం ముందే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్‌దేవ్‌ గిరి తెలిపారు.

Updated : 22 Jan 2024 08:45 IST

ట్రస్టు కోశాధికారి వెల్లడి

అయోధ్య: ఇన్నాళ్లూ తాత్కాలిక మందిరంలో ఉన్న పాత రామ్‌లల్లా మూర్తి సోమవారం గర్భగుడిలో కొత్తగా ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం ముందే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్‌దేవ్‌ గిరి తెలిపారు. ‘‘పాత విగ్రహం అయిదారు అంగుళాల ఎత్తు ఉంది. 25 - 30 అడుగుల దూరం నుంచి అది స్పష్టంగా కనిపించదు. అందుకే 51 అంగుళాల కొత్త మూర్తి అవసరమైంది’’ అని చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,100 కోట్లకు పైగా ఖర్చయినట్లు వెల్లడించారు. మందిర నిర్మాణం 2024లోనే పూర్తి చేస్తామని, మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. ముగ్గురు శిల్పులు చెక్కిన విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించిన ప్రతిమను ఎంపిక చేయడానికి చాలా తర్జనభర్జన పడాల్సి వచ్చిందని.. ఎంతో చక్కగా ఉన్న మిగతా రెండింటిని కూడా ఆలయంలోనే ఉంచుతామన్నారు. వాటిలో ఒకదాన్ని రాముడి వస్త్రాలు, ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తామన్నారు. దేశమంతా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఆవరించిందని, ముఖ్యంగా యువత కూడా ఇటువైపు చూస్తుండటం మంచి పరిణామమన్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రణాళిక ఏమిటనే విషయంపై రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర స్పందిస్తూ.. ‘‘జనవరి 23 నుంచే మళ్లీ నిర్మాణపనులను మొదలుపెడతాం. ఆలయ ప్రాంగణంలో మరో ఏడు ఉపాలయాలు నిర్మించాల్సి ఉంది’ అన్నారు.


ఆధ్యాత్మిక నగరిలో మూడంచెల భద్రత

రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకల కోసం యూపీ పోలీసుల ఏర్పాట్లు

అయోధ్యలో సోమవారం ప్రాణప్రతిష్ఠ వేడుకను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌) కూడా గస్తీలో పాల్గొననుంది. ప్రముఖులు ప్రయాణించే రోడ్లలో ట్రాఫిక్‌ నియంత్రణకు ముళ్లకంచెలతో కూడిన బారికేడ్లను ఏర్పాటుచేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ధర్మపథ్‌, రామ్‌పథ్‌ ప్రాంతాల నుంచి హనుమాన్‌గఢీ, అషర్ఫీ భవన్‌ వీధుల్లో పోలీసులు గస్తీ(పెట్రోలింగ్‌) నిర్వహించనున్నారు. అయోధ్య జిల్లాతో పాటు రెడ్‌జోన్‌, ఎల్లో జోన్‌లలోని ప్రతి రోడ్డులోనూ భద్రత పెంచామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాల సహాయంతో సరయు నది పొడవునా భద్రతను పెంచామని, అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని, జనసమూహాల్ని నియంత్రించేందుకు డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నామని వారు వివరించారు.  

దిల్లీలో.. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దృష్ట్యా దేశ రాజధాని దిల్లీలోనూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. వివిధ ఆలయాలు, మార్కెట్లలో బహుళ అంచెల భద్రత కేంద్రాలను ఏర్పాటు చేశామని, హోటళ్లు, అతిథి గృహాలు, ధర్మశాలల్లో గస్తీ పోలీసులు తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని