అటు నారి.. ఇటు సైనిక భేరి

గణతంత్ర దినోత్సవ వేళ.. భారత్‌ తన సైనిక శక్తితో పాటు నారీ శక్తినీ ప్రపంచానికి చాటి చెప్పింది.

Updated : 27 Jan 2024 06:33 IST

దేశ సాయుధ పాటవాన్ని చాటిన గణతంత్ర వేడుక
తొలిసారి మహిళా త్రివిధ దళాల బృందం కవాతు

దిల్లీ: గణతంత్ర దినోత్సవ వేళ.. భారత్‌ తన సైనిక శక్తితో పాటు నారీ శక్తినీ ప్రపంచానికి చాటి చెప్పింది. కర్తవ్యపథ్‌ కవాతులో తొలిసారి త్రివిధ దళాల మహిళలు కదం తొక్కి.. యావత్‌ భారతావని గర్వించేలా చేశారు. 75వ గణతంత్ర సంబరాలు అంబరాన్ని తాకేలా చేశారు. దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్యపథ్‌లో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత పరేడ్‌ ప్రారంభమైంది. అంతకుముందు సంప్రదాయ గుర్రపు బగ్గీలో గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి రాష్ట్రపతి కర్తవ్యపథ్‌ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వారికి స్వాగతం పలికారు. మహిళా శక్తితో పాటు.. భారత్‌ ఘన సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా పరేడ్‌ జరిగింది. గణతంత్ర దినోత్సవ చరిత్రలోనే తొలిసారిగా పూర్తిస్థాయిలో త్రివిధ దళాలకు చెందిన నారీమణులు.. తమ అమేయ శక్తిని చాటిచెప్పారు. వీరు కవాతు చేస్తున్నప్పుడు ప్రధాని, కేంద్ర మంత్రులు.. ఇతర సీనియర్‌ ఉన్నతాధికారులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించడం విశేషం. అంతే కాదు గ్రామీణ పరిశ్రమలు, రక్షణ, సైన్స్‌, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం.. తదితర రంగాల్లో మహిళల విశేష పాత్రకు అద్దం పట్టేలా ఆసాంతం పరేడ్‌ జరగడం గమనార్హం.


ఆవాహన్‌తో ప్రారంభం..

‘ఆవాహన్‌’ సైనిక బ్యాండ్‌తో కవాతు ప్రారంభమైంది. ఇందులో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. శంఖం, నాద స్వరం, నగారా తదితర సంప్రదాయ వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. నాలుగు ఎంఐ-17వి హెలికాప్టర్లు ధ్వజ్‌ ఆకృతిలో విన్యాసాలు నిర్వహించాయి. ఈసారి కవాతులో 95 మంది సభ్యుల ఫ్రాన్స్‌ సైనిక బృందం కూడా పాల్గొంది. వారు పరేడ్‌ చేస్తున్న సమయంలో రఫేల్‌ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేశాయి. మహిళా అధికారులు దీప్తి రాణా, ప్రియాంకా సేవ్‌దా.. ఆయుధ లొకేషన్‌ గుర్తింపు రాడార్‌, పినాక రాకెట్‌ వ్యవస్థలకు నేతృత్వం వహించారు. దేశ చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు కవాతులో కదం తొక్కాయి. ఈ బృందానికి కెప్టెన్‌ సంధ్య నేతృత్వం వహించారు. భారత నౌకాదళానికి చెందిన మహిళా, పురుష అగ్నివీరులు కూడా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ బృందాన్ని లెఫ్టినెంట్‌ ప్రజ్వల్‌ ముందుండి నడిపించారు. 148 మంది ఎన్‌సీసీ మహిళా క్యాడెట్లు, 200 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ మహిళా వాలంటీర్లు కూడా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. మహిళా సాధికారత, నారీశక్తి థీమ్‌తో నౌకాదళ శకటం ఆకట్టుకుంది. దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతో పాటు నాగ్‌ క్షిపణులు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, బీఎంపీ-2 సాయుధ శకటాలను ప్రదర్శించారు. ఎయిర్‌ఫోర్స్‌ మార్చ్‌పాస్ట్‌కు స్క్వాడ్రన్‌ లీడర్లు రష్మీ ఠాకుర్‌, సుమితా యాదవ్‌, ప్రతిథి అహ్లూవాలియా, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ కిరిట్‌ రొహైల్‌ నేతృత్వం వహించారు. 265 మంది సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ మహిళా సైనికులు ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలు చేశారు. తొలిసారి బీఎస్‌ఎఫ్‌ మహిళా బ్రాస్‌ బ్యాండ్‌ ఈ పరేడ్‌లో పాల్గొంది.300 ఏళ్ల బాంబే శాపర్స్‌ రెజిమెంట్‌ చరిత్రలో తొలిసారిగా అందరూ పురుషులే ఉన్న బృందానికి 31 ఏళ్ల మేజర్‌ దివ్య త్యాగి సారథ్యం వహించారు. సైన్యం తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. ఇందులో టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, నాగ్‌ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్‌ జామర్‌ వ్యవస్థలు, పినాక మల్టిపుల్‌ రాకెట్‌ వ్యవస్థ, వెపన్‌ లొకేషన్‌ రాడార్‌ వ్యవస్థలు ఉన్నాయి.


‘బాంధనీ’ తలపాగాతో మెరిసిన మోదీ

ప్రధాని మోదీ గణతంత్ర వేడుకల్లో సంప్రదాయం ఉట్టిపడేలా రంగురంగుల బాంధనీ తలపాగా,  తెల్లటి కుర్తా-పైజామా, గోధుమ వర్ణపు వి-నెక్‌ జాకెట్‌ ధరించి ప్రత్యేకంగా కనిపించారు. కవాతు ముగిసిన తర్వాత పరేడ్‌ను వీక్షించేందుకు వచ్చిన ప్రజలతో మోదీ కలిసిపోయారు. వారితో ఫొటోలు దిగారు. ఈ సమయంలో ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో కర్తవ్యపథ్‌ మార్మోగిపోయింది.


యూపీ శకటంపై అయోధ్య బాలరాముడు

పరేడ్‌లో పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని గుర్తు చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ శకటాన్ని ప్రదర్శించారు. ఇందులో ఏర్పాటు చేసిన బాలరాముడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతరిక్ష రంగంలో చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1 లాంటి చరిత్రాత్మక విజయాలను కళ్లకుకట్టేలా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శకటాన్ని ప్రదర్శించింది. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఆర్యభట్ట, వరాహమిహిరుడు లాంటి ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తల చిత్రాలను వీటిలో ప్రదర్శించారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఇమా కెయితల్‌’ మార్కెట్‌ శకటాన్ని మణిపుర్‌ ప్రదర్శించింది. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని తెలిపేలా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ శకటాన్ని ప్రదర్శించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని