యూపీయే నాటి సవాళ్లు అధిగమించాం

యూపీయే సర్కారు వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించి, సుస్థిరమైన వృద్ధి ప్రస్థానం దిశలో దేశాన్ని నిలబెట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Published : 09 Feb 2024 04:38 IST

ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాం: నిర్మల
పార్లమెంటులో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కేంద్రం వెల్లడి

దిల్లీ: యూపీయే సర్కారు వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించి, సుస్థిరమైన వృద్ధి ప్రస్థానం దిశలో దేశాన్ని నిలబెట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 2014కి ముందు, తర్వాత దేశ ఆర్థిక స్థితిగతులపై గురువారం లోక్‌సభలో 54 పేజీల శ్వేతపత్రాన్ని ఆమె ప్రవేశపెట్టారు. యూపీఏ పదేళ్ల పాలనతో పోలిస్తే.. తమ పదేళ్ల పాలనలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో అందులో వివరించారు. దీనిపై శుక్రవారం సభలో చర్చ జరపనున్నారు.

దీర్ఘకాల ప్రయోజనాలకు కీలక సంస్కరణలు

‘‘పదేళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అచేతన స్థితిలో ఉంచింది. ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఆర్థిక వృద్ధిని అడ్డుకునేందుకు సమస్యలను సృష్టించింది. 2014లో దేశ ఆర్థిక పరిస్థితి దుర్బలంగా ఉండేది. ఎటుచూసినా అవినీతే. ఆర్థిక క్రమశిక్షణ అనేదే లేదు. ఆర్థిక నిర్వహణ ఘోరం. అంతటా నిధులకు కటకటే. ఒకరకంగా అదో సంక్షోభ పరిస్థితి. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక దానికి భిన్నంగా, దీర్ఘకాల ప్రయోజనాల కోసం కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ వచ్చింది. ఎంతో ప్రయాసతో పాలనను గాడిలో పెట్టింది. ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే చర్యలు తీసుకునే బదులు అవరోధాలు సృష్టించడం వల్ల యూపీయే హయాంలో నల్లధనం పెరిగిపోయింది. ఘోరంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చివెళ్లారు. ఆర్థిక వ్యవస్థ విస్తృత ప్రయోజనాల కోసం, విధానపరమైన స్థిరత్వం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని మోదీ సర్కారు గుర్తించింది. బలమైన సౌధాన్ని కట్టేందుకు పటిష్ఠ ఆర్థిక పునాదుల్ని నిర్మించింది. ఒక్కసారి వెనుదిరిగి చూస్తే గత దశాబ్ద కాలంలో ఎన్నో సవాళ్లను దాటుకుని విజయ ప్రస్థానం సాగించామని సగర్వంగా, సవినయంగా చెప్పగలం. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను 2047 నాటికి తీర్చిదిద్దడానికి ఇది కర్తవ్య కాలం. చేయాల్సింది ఎంతో ఉంది’’ అని నిర్మల వివరించారు. శ్వేతపత్రంలోని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భాజపా దేశవ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది.


ఏపీ, ఒడిశాలోని ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో మార్పులకు ఆమోదం

దిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌, ఒడిశాలలోని ఎస్సీ, ఎస్టీల జాబితాల్లో మార్పులు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లులకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను మంగళవారమే రాజ్యసభ ఆమోదించింది. ‘ద కాన్‌స్టిట్యూషన్‌ (షెడ్యూల్డ్‌ తెగలు) ఆర్డర్‌ (సవరణ) బిల్లు-2024’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్టీల జాబితాలో మార్పులు జరగనున్నాయి. ‘ద కాన్‌స్టిట్యూషన్‌ (షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు) ఆర్డర్‌ (సవరణ) బిల్లు-2024 ద్వారా ఒడిశాలోని ఎస్సీ, ఎస్టీల జాబితాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బోండో పోర్జా, ఖోండ్‌ పోర్జా, పరాంజీపేర్జా సామాజిక వర్గాలు ఎస్టీ జాబితాలో చేరనున్నాయి.


బడ్జెట్‌కు రాజ్యసభ ఆమోదం

దిల్లీ: తాత్కాలిక బడ్జెట్‌కు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. 2024-25కు సంబంధించిన బడ్జెట్‌ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులు, జమ్మూ కశ్మీర్‌ ఆర్థిక బిల్లులనూ సభ ఆమోదించింది. వాటిని లోక్‌సభకు పంపింది. బుధవారమే ఈ బిల్లులకు లోక్‌సభలో ఆమోద ముద్ర పడింది. దీంతో బడ్జెట్‌ ప్రక్రియ పూర్తయినట్లైంది. ఆర్థిక వృద్ధిలో భాగంగా తాత్కాలిక బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని భారీగా పెంచామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చకు ఆమె సమాధానమిచ్చారు. ప్రభుత్వ మౌలిక వసతుల కల్పన వృద్ధి జీడీపీ కంటే వేగంగా సాగుతోందని తెలిపారు.

డిస్కంల బకాయిలు రూ.50,000 కోట్లకు తగ్గాయని గురువారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. 2022 విద్యుత్తు నిబంధనల అమలుతో 1,39,947 కోట్లున్న బకాయిలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని