మూడో దఫా ప్రభుత్వంలో ఇంతకుమించి భారీ నిర్ణయాలు

కేంద్రంలో తన నేతృత్వంలో ఏర్పడబోయే మూడో దఫా ప్రభుత్వానికి పూర్తిస్థాయి మార్గసూచీ తయారీని ఇప్పటికే ప్రారంభించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 20-30 రోజుల్లో దీనికి తుది రూపం వస్తుందన్నారు.

Published : 10 Feb 2024 05:08 IST

నెల రోజుల్లో పూర్తిస్థాయి మార్గసూచీ తయారీ
15 లక్షల మంది నుంచి సూచనల సేకరణ
ప్రధాని మోదీ వెల్లడి

దిల్లీ: కేంద్రంలో తన నేతృత్వంలో ఏర్పడబోయే మూడో దఫా ప్రభుత్వానికి పూర్తిస్థాయి మార్గసూచీ తయారీని ఇప్పటికే ప్రారంభించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 20-30 రోజుల్లో దీనికి తుది రూపం వస్తుందన్నారు. 15 మంది లక్షల మందికి పైగా దీనికి సూచనలు ఇచ్చారని తెలిపారు. నవ్య భారత కార్యాచరణ భారీ వేగంతో జరుగుతుందని భరోసా వ్యక్తం చేశారు. టైమ్స్‌ గ్రూప్‌నకు చెందిన ‘ఈటీ నౌ గ్లోబల్‌ బిజినెస్‌ సమిట్‌’లో శుక్రవారం ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ విషయాలను పేర్కొన్నారు. దేశాభివృద్ధికి సరికొత్త వేగాన్ని అందించేందుకు, పేదరిక నిర్మూలనకు వినూత్న పథకాల అమలును చేపట్టినట్లు చెప్పారు. పదేళ్ల యూపీఏ హయాంతో పోల్చితే తన నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన పూర్తిస్థాయిలో రూపాంతరం చెందడమే కాకుండా వేగాన్నీ పుంజుకుందన్నారు. మూడో దఫా ప్రభుత్వంలో ఇంతకు మించిన వేగం, భారీ నిర్ణయాలుంటాయని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన సంపూర్ణ మార్గసూచీని రూపొందిస్తున్నామని తెలిపారు. ఇది మోదీ గ్యారెంటీ అని తెలుపగా సభికులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.

శ్వేత పత్రంపై..

యూపీఏ పాలనపై శ్వేత పత్రాన్ని పదేళ్ల తర్వాత తీసుకురావడానికి గల కారణాన్ని ప్రధాని మోదీ వివరించారు. 2014లో తాను అధికారాన్ని చేపట్టేనాటికి దేశ భద్రతతో పాటు అర్థిక వ్యవస్థ నిర్వహణ, పాలన తదితరాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. తాను ప్రధాని పదవిని చేపట్టిన వెంటనే శ్వేత పత్రాన్ని తీసుకువచ్చి ఉంటే....దేశ శక్తిసామర్థ్యాలపై ప్రజల విశ్వాసాన్ని అది దెబ్బతీసేదని తెలిపారు. అందుకే రాజకీయ ప్రయోజనాలను కాకుండా దేశప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ శ్వేత పత్రాన్ని ఇప్పుడు విడుదల చేసినట్లు వెల్లడించారు. దేశం తీవ్ర పరిణామాలను చవిచూడకుండా తమ ప్రభుత్వం కాపాడిందన్నారు. దేశ శక్తిసామర్థ్యాలపై ఇప్పుడున్నంత సానుకూల వాతావరణం, విశ్వాసం గతంలో లేదని విస్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన అంటూ గత ప్రభుత్వాలు ఏడు దశాబ్దాల పాటు నినాదాలకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని