ఖైదీలపై కుల-మత వివక్ష చూపొద్దు

ఖైదీల విషయంలో కుల, మత ప్రాతిపదికన ఎలాంటి వివక్ష చూపొద్దని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.

Published : 01 Mar 2024 03:35 IST

రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశం

ఈనాడు, దిల్లీ: ఖైదీల విషయంలో కుల, మత ప్రాతిపదికన ఎలాంటి వివక్ష చూపొద్దని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హోం/ జైళ్లశాఖ ముఖ్య కార్యదర్శులు, జైళ్ల డీజీ/ఐజీలకు లేఖలు రాసింది. ‘‘ఖైదీలను కులం, మతం ఆధారంగా వేరుచేయడానికి కొన్ని రాష్ట్రాల జైళ్ల నిబంధనలు అవకాశం కల్పిస్తున్నట్లు హోంశాఖ దృష్టికి వచ్చింది. ఆ మేరకు ఖైదీలకు పనులు కూడా అప్పగిస్తున్నట్లు తెలియవచ్చింది. మతం, జాతి, ప్రాంతం ఆధారంగా వివక్ష చూపడాన్ని రాజ్యాంగం నిషేధిస్తోంది. మోడల్‌ ప్రిజన్‌ మాన్యువల్‌-2016ను ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపాం. వంట గదుల నిర్వహణ, ఆహార తయారీ విషయంలో కులం, మతం ఆధారంగా వివక్ష చూపకూడదని అందులో స్పష్టంగా పేర్కొన్నాం. నిర్దిష్ట కులం, మతానికి సంబంధించిన ఖైదీలకు ప్రత్యేక మర్యాదలు చేయడాన్ని పూర్తిగా నిషేధించాం. అందువల్ల సామాజిక, ఆర్థిక, కుల, తరగతి ఆధారంగా ఖైదీలను వర్గీకరించడానికి వీల్లేదు. వివక్షాపూరిత నిబంధనలను తక్షణం తొలగించాలి. జైళ్ల నిర్వహణలో ఖైదీలకు వైద్యసేవలు అందించడం కూడా ముఖ్యమైన అంశం. వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యమివ్వాలి. ఖైదీలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు జరగాలి. మహిళలు, ట్రాన్స్‌జెండర్‌ ఖైదీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలి. వీటి గురించి ఎప్పటికప్పుడు ఈ-ప్రిజన్స్‌ పోర్టల్‌లో నివేదించాలి’’ అని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని