చక్రాల కుర్చీ లేక వృద్ధుడి మృతి ఘటన.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా

చక్రాల కుర్చీ లేకపోవడంతో ఓ వృద్ధ ప్రయాణికుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయిన ఘటనను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తీవ్రంగా పరిగణించింది.

Published : 01 Mar 2024 03:38 IST

దిల్లీ: చక్రాల కుర్చీ లేకపోవడంతో ఓ వృద్ధ ప్రయాణికుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయిన ఘటనను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తీవ్రంగా పరిగణించింది. విమాన సేవల్లో అలసత్వం వహించినందుకు ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఫిబ్రవరి 12న అమెరికా నుంచి ఎయిరిండియా విమానంలో వృద్ధ దంపతులు ముంబయిలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. విమాన సిబ్బంది వీల్‌ఛైర్‌ సదుపాయం కల్పించకపోవడంతో ఆ వృద్ధుడు (80) టెర్మినల్‌ వరకు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఎయిరిండియాకు డీజీసీఏ గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఎయిరిండియా వివరణ ఇచ్చింది. ప్రయాణికుడి భార్యకు వీల్‌ఛైర్‌ సమకూర్చామని ఎయిరిండియా పేర్కొంది. మరో వీల్‌ఛైర్‌ను తెచ్చేవరకూ వేచి ఉండాలని ఆయనకు సూచించినట్లు తెలిపింది. కానీ ఆయన తన భార్యతో కలిసి టెర్మినల్‌ వరకు నడుచుకుంటూ వెళ్లారని వివరించింది. దీనిపై సంతృప్తి చెందని డీజీసీఏ తాజాగా చర్యలు చేపట్టింది. ఈసందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగిన సంఖ్యలో వీల్‌ఛైర్లను అందుబాటులో ఉంచుకోవాలని అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని