ఈవీఎంలపై భయాందోళన అనవసరం: సీఈసీ రాజీవ్‌ కుమార్‌

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) వాడడంపై భయాందోళనలు అనవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ స్పష్టంచేశారు.

Published : 03 Mar 2024 06:07 IST

 

లఖ్‌నవూ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) వాడడంపై భయాందోళనలు అనవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. వాటిలో ఎవరూ ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై శనివారం లఖ్‌నవూలో సమీక్షించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలను భద్రపరిచే గదులను ఎవరు తెరవాలన్నా తమ అనుమతి కచ్చితంగా ఉండాల్సిందేనని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే అంతా జరుగుతుందని చెప్పారు. ఏ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయో పోలింగ్‌ ఏజెంట్ల వద్ద ఉంటుందని, లెక్కింపు మొదలయ్యే ముందు వారు వాటిని సరిచూసుకోవచ్చని చెప్పారు. ‘‘ఒకరి బదులు మరొకరు ఓట్లు వేయడంపై దృష్టి సారించాలని యంత్రాంగానికి తెలిపాం. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడాలని ప్రయత్నించేవారిపై వెన్వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పాం. ఈవీఎంలను తరలించడానికి అధికారిక వాహనాలను మాత్రమే వినియోగించాలి. వాటికి తప్పనిసరిగా జీపీఎస్‌ వ్యవస్థ ఉండాలి. ఓటరు కార్డులు, ఓటు వివరాల చీటీలు సకాలంలో జారీ చేయాలి. పరిశీలకుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ప్రజలకు తెలియపరచాలి. తప్పుడు వార్తలకు కళ్లెం వేయడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు