దేశీయ ముస్లింలు భయపడొద్దు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై భారత్‌లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది.

Published : 13 Mar 2024 05:49 IST

సీఏఏతో వారి హక్కులకు ముప్పులేదు
వారెలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పనిలేదు: కేంద్రం
విధివిధానాల వెల్లడి

ఈనాడు, దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై భారత్‌లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. దేశంలోని 18 కోట్లమంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో పీడనకు గురైన ముస్లిమేతర మైనారిటీలు 2014 డిసెంబరు 31లోగా మన దేశానికి వచ్చి ఉన్నట్లయితే వారికి మన పౌరసత్వం ఇచ్చే సీఏఏ-2019 చట్ట నిబంధనల్ని కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం మరింత స్పష్టతనిచ్చింది. ‘‘.. ఆ మూడు ముస్లిం దేశాల్లో మైనారిటీలు పీడనకు గురి కావడం వల్ల ఇస్లాం అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అపనింద వచ్చింది. నిజానికి ఇస్లాం శాంతికాముక మతం. విద్వేషం, హింస, పీడనలను అది ఎన్నడూ ప్రబోధించలేదు. కళంకం నుంచి ఇస్లాంను ఈ చట్టం రక్షిస్తుంది. మన దేశంలోకి వలసవచ్చిన శరణార్థుల్ని వెనక్కి పంపేందుకు బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌లతో మనకెలాంటి ఒప్పందం లేదు. అక్రమ వలసదారులను వెనక్కి పంపే అంశమే ఈ చట్టంలో లేదు.అపోహలు అనవసరం’’ అని వివరించింది.

పౌరసత్వ చట్టం కిందనైతే ముస్లింలైనా దరఖాస్తు చేయవచ్చు

‘‘అక్రమంగా వలసవచ్చిన వారిని పౌరసత్వ చట్టం-1955 మాదిరిగానే సీఏఏ కూడా ‘ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన విదేశీ’గానే గుర్తిస్తుంది. ముస్లింలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదు. ఏ దేశ ముస్లింలైనా పౌరసత్వ చట్టం సెక్షన్‌-6 కింద భారతీయ పౌరసత్వం కోరవచ్చు. అది సహజసిద్ధమైన పౌరసత్వాన్ని పరిశీలిస్తుంది’’ అని హోంశాఖ తెలిపింది. ముస్లింలతోపాటు, ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన ఇతర వ్యక్తులైనా ప్రస్తుత చట్టాల ప్రకారం భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చంది. ఈ మూడు దేశాల్లో ముస్లింలెవరైనా వేధింపులకు గురవుతుంటే వారు ప్రస్తుత చట్టాలను అనుసరించి భారత్‌ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ చట్టం అడ్డుకాదంది.


వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌

భారత పౌరసత్వం కోసం మూడు దేశాల శరణార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర సర్కారు కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. సీఏఏ-2019 కింద అర్హత కలిగిన వ్యక్తులెవరైనా indiancitizenshiponline.
nic.in
అనే పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని హోంశాఖ తెలిపింది. ఆ మూడు దేశాల నుంచి మన దేశంలోకి ఏ తేదీన వచ్చారో ఆనాటి నుంచి పౌరసత్వం వర్తిస్తుందని వెల్లడించింది. ఏ దేశం నుంచి వచ్చారో తెలిపేందుకు తొమ్మిది రకాల పత్రాల్లో ఏదో ఒకదానిని, ఏ తేదీన వచ్చారో తెలిపే 20 పత్రాల్లో ఒక దానిని దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది. ‘సీఏఏ-2019’ పేరిట త్వరలో ఓ మొబైల్‌ యాప్‌ను తీసుకురానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని