విరాళాల్లో.. ధారాళం

ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. శుక్రవారంలోగా డేటాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా గురువారమే ఈసీ వెల్లడించింది.

Updated : 15 Mar 2024 07:45 IST

భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, వ్యక్తులు
మొత్తం విరాళాలు రూ.11,671 కోట్లు
రూ.1,368 కోట్లు పెట్టిన ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ
మేఘా ఇంజినీరింగ్‌ వాటా రూ.966 కోట్లు
ఒక్క నెలలోనే షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ విరాళం రూ.40 కోట్లు
ప్రధాన పార్టీలన్నింటికీ లబ్ధి
బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన ఎన్నికల సంఘం

దిల్లీ: ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. శుక్రవారంలోగా డేటాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా గురువారమే ఈసీ వెల్లడించింది. ఈ డేటాను ఈసీ రెండు భాగాలుగా పేర్కొంది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్‌సైట్‌లో ఉంచింది. రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఇందులో పొందుపరచలేదు. దానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్‌బీఐ వెల్లడించింది. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలను ఫ్యాక్ట్‌ ఫైండర్‌ మహమ్మద్‌ జుబేర్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భాజపాకు రూ.6,061 కోట్లు, తృణమూల్‌కు రూ.1,610 కోట్లు, కాంగ్రెస్‌కు 1,422 కోట్లు వచ్చాయి. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్‌ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిత్తల్‌ నుంచి బిలియనీర్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌, అనిల్‌ అగర్వాల్‌, ఐటీసీ, మహీంద్ర అండ్‌ మహీంద్ర, కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్‌, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌, అంతగా పేరులేని ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ కంపెనీలున్నాయి. మరోవైపు ఎన్నికల బాండ్లపై శుక్రవారం ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ముంబయికి చెందిన క్విక్‌ సప్లై చైన్‌ సంస్థ రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత రూ.400 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. హల్దియా ఎనర్జీ సంస్థ రూ.377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. గాజియాబాద్‌ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ రూ.162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.  స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిత్తల్‌ తన సొంత డబ్బు రూ.35 కోట్లతో బాండ్లను కొన్నారు. దీంతోపాటు ఆయన కంపెనీలు మరో రూ.247 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి. ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ విరాళం రూ.224 కోట్లు. వెస్ట్రన్‌ యూపీ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌: రూ.220 కోట్లు. కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌: రూ.194 కోట్లు. మదన్‌లాల్‌ లిమిటెడ్‌: రూ.185 కోట్లు.  డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌: రూ.170 కోట్లు.  జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌: రూ.123 కోట్లు. బిర్లా కార్బన్‌ ఇండియా: రూ.105 కోట్లు. రుంగ్తా సన్స్‌: రూ.100 కోట్లు.  కిరణ్‌ మజుందార్‌ షా, వరుణ్‌ గుప్తా, బీకే గోయెంకా, జైనేంద్ర షా, మోనికా వ్యక్తిగతంగా బాండ్లను కొన్నారు.  బజాజ్‌ ఆటో రూ.18 కోట్లు, బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.20 కోట్లు, ఇండిగో సంస్థలు రూ.36 కోట్లు, స్పైస్‌జెట్‌ రూ.65 లక్షల బాండ్లను కొన్నాయి. ఇండిగో సంస్థకు చెందిన రాహల్‌ భాటియా రూ.20 కోట్ల బాండ్లను కొన్నారు.  రూ.10లక్షల విలువైన బాండ్లను 4,620 మంది, రూ.లక్ష విలువైన బాండ్లను 2,228 మంది కొనుగోలు చేశారు.


మేఘా ఇంజినీరింగ్‌ భారీ విరాళం

ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకూ ఆ సంస్థ కోటి రూపాయల విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడైంది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే రూ.కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది.

ఎవరి వాటా ఎంత?

  • డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌: రూ.80 కోట్లు
  • నాట్కోఫార్మా: రూ.70 కోట్లు
  • ఎన్‌సీసీ లిమిటెడ్‌: రూ.60 కోట్లు
  • హెటిరో గ్రూప్‌: రూ.60 కోట్లు'
  • నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌: రూ.55 కోట్లు
  • దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌: రూ.55 కోట్లు
  • అరబిందో ఫార్మా లిమిటెడ్‌: రూ.50 కోట్లు
  • రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.45 కోట్లు
  • గ్రీన్‌కో: రూ.35 కోట్లు
  • అపర్ణా ఫామ్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ సంస్థ: రూ.30 కోట్లు
  • ఎన్‌ఎస్‌ఎల్‌ ఎస్‌ఈజెడ్‌ హైదరాబాద్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.29 కోట్లు
  • కల్పతరు ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌: రూ.26.50 కోట్లు
  • మైహోం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.25 కోట్లు
  • రాజపుష్ప గ్రూప్‌: రూ.25 కోట్లు
  • ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌: రూ.10 కోట్లు
  • నారా కన్‌స్ట్రక్షన్స్‌: రూ.10 కోట్లు
  • భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌: రూ.10 కోట్లు
  • సోమశిల సోలార్‌ పవర్‌ లిమిటెడ్‌: రూ.7 కోట్లు
  • శ్రీచైతన్య స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌: రూ.6 కోట్లు
  • సుధాకర్‌ కంచర్ల: రూ.5 కోట్లు
  • కేసీఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ: రూ.5 కోట్లు
  • ఐల్యాబ్స్‌ హైదరాబాద్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రూ.5 కోట్లు.

వైకాపాకు రూ.337 కోట్లు: ఎన్నికల బాండ్ల రూపంలో ఏపీలో అందిన విరాళాల్లో వైకాపాదే అగ్రస్థానం. ఆ పార్టీకి ఇప్పటిదాకా రూ.337 కోట్లు అందాయి. తెదేపాకు రూ.219 కోట్లు వచ్చాయి. జనసేనకు రూ.21 కోట్లు వచ్చాయి.

తెలంగాణలో భారాసకు రూ.1,215 కోట్ల విరాళాలు అందాయి.


మహమ్మద్‌ జుబేర్‌ అందించిన వివరాల ప్రకారం పార్టీల వారీగా విరాళాలు..

బీజేడీ: రూ.776 కోట్లు. డీఎంకే: రూ.639 కోట్లు. శివసేన: రూ.158 కోట్లు. ఆర్జేడీ: రూ.73 కోట్లు. ఆప్‌: రూ.65 కోట్లు. జనతాదళ్‌(సెక్యులర్‌): రూ.44 కోట్లు. ఎన్సీపీ: రూ.31 కోట్లు. ఎస్పీ: రూ.14 కోట్లు. జేడీయూ: రూ.14 కోట్లు.


ఎన్నికల బాండ్లను పొందిన పార్టీలు

భాజపా, కాంగ్రెస్‌, భారాస, వైకాపా, ఏఐఏడీఎంకే, తెదేపా, శివసేన, డీఎంకే, జేడీఎస్‌, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్జేడీ, ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీ, జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, బిజూ జనతాదళ్‌, గోవా ఫార్వర్డ్‌ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా, జేఎంఎం, సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, జనసేన.


ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీలు..

మేఘా ఇంజినీరింగ్‌, స్పైస్‌ జెట్‌, ఇండిగో, గ్రాసిం ఇండస్ట్రీస్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, టొరెంట్‌ పవర్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డీఎల్‌ఎఫ్‌ కమర్షియల్‌ డెవలపర్స్‌, వేదాంత లిమిటెడ్‌, అపోలో టైర్స్‌, లక్ష్మీ మిత్తల్‌, ఎడెల్‌వీస్‌, పీవీఆర్‌, కెవెంటర్‌, సులా వైన్‌, వెల్‌స్పన్‌, సన్‌ ఫార్మా, వర్ధమాన్‌ టెక్స్‌టైల్స్‌, జిందాల్‌ గ్రూప్‌, ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌, సియట్‌ టైర్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, ఐటీసీ, కేపీ ఎంటర్‌ప్రైజెస్‌, సిప్లా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని