దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు

మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వేగం పెంచింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది.

Published : 22 Mar 2024 05:35 IST

దిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్న ఈడీ
రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన గంటల్లోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ
ఆందోళనకు దిగిన ఆమ్‌ ఆద్మీ కార్యకర్తలు
దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు
సుప్రీంను ఆశ్రయించిన ఆప్‌ అగ్రనేత.. నేడు విచారణ!

దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వేగం పెంచింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అంతకుముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్‌ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆప్‌ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.

ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నింటినీ దిల్లీ పోలీసులు మూసివేశారు. కీలక పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్‌ చేయగా...అరెస్టయినప్పటికీ ఆయనే సీఎంగా కొనసాగుతారని ఆప్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ప్రకటించారు. అవసరమైతే జైలునుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని అన్నారు.

దిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు 16 మందిని ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసు అభియోగ పత్రాల్లో పలుమార్లు కేజ్రీవాల్‌ పేరును ప్రస్తావించింది. విచారణకు హాజరుకావాలని ఈడీ 9సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నిరాకరించిన కేజ్రీవాల్‌...అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌, జస్టిస్‌ మనోజ్‌ జైన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఈడీని వివరణ కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కి వాయిదా వేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఈడీ అధికారుల బృందం సెర్చ్‌ వారెంట్‌తో కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లడం, సోదాలు చేయడం, ప్రశ్నించి ఆయనను అదుపులోకి తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇదే కేసులో... గత వారం భారాస నేత కవితను ఈడీ అరెస్టు చేసింది. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ జైల్లో ఉన్నారు. గురువారం నాటి సోదాల్లో కేజ్రీవాల్‌ నివాసంలో కేసుకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని, రూ.70వేలు ఇంట్లో ఉండగా ఆ మొత్తాన్ని ఈడీ అధికారులు తమకు అప్పగించారని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. కేజ్రీవాల్‌ సెల్‌ఫోన్‌ను దర్యాప్తు అధికారులు తీసేసుకున్నారన్నారు. అరెస్టును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా భాజపా కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆప్‌ పిలుపునిచ్చింది.

సుప్రీంకోర్టులో పిటిషన్‌

అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసిన వెంటనే కేజ్రీవాల్‌ తరపు న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తుండగానే ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో న్యాయవాదులు గురువారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ఇంటికి వెళ్లి వెంటనే విచారణ జరపటం కోసం విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సమ్మతించలేదని తెలిసింది. వారి పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్న ఈడీ

అదుపులోకి తీసుకున్న తర్వాత కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు సెంట్రల్‌ దిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆప్‌ నేతను శుక్రవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని, కస్టడీకి అప్పగించాలని కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు.

ఇది రాజకీయ కుట్రే: ఆప్‌

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద రాజకీయ కుట్రేనని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డా ఆరోపించారు. పంజాబ్‌ సీఎం మాన్‌, కాంగ్రెస్‌, డీఎంకే, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ పార్టీలు ఖండించాయి. ఎన్నికల సమయంలో అరెస్టులు రాజకీయాల స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌పవార్‌ విమర్శించారు.  నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి కేజ్రీవాల్‌ తప్పుకోవాలని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా డిమాండ్‌ చేశారు. ‘భయపడిన ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడు. మీడియా సహా అన్ని సంస్థలను బంధించి, పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాను స్తంభింపజేస్తూ ప్రవర్తిస్తున్నారు. దీనికి ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుంది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని