మధ్యంతర ఉపశమనం కలిగించండి

మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో తనను అరెస్టు చేయడంపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated : 04 Apr 2024 05:56 IST

దిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్‌ వినతి

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో తనను అరెస్టు చేయడంపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అవమానించడమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఏకైక లక్ష్యమన్నారు. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు తనను నిరోధించడమే దర్యాప్తు సంస్థ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈడీ అరెస్టును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఆయన.. మధ్యంతర ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం బుధవారం విచారించింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రం చౌధరీలు వాదనలు వినిపించారు. దిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన సమయం పలు సందేహాలకు తావిస్తోందన్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఈడీ తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదనలు వినిపిస్తూ.. త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యంలో అరెస్టు నుంచి కేజ్రీవాల్‌ ఉపశమనాన్ని పొందలేరని పేర్కొన్నారు. చట్టం ఆయనకూ సామాన్యులకు ఒకేలా వర్తిస్తుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ తీర్పును గురువారానికి వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు నీరు కాచుకునేందుకు, టీ పెట్టుకునేందుకు విద్యుత్‌ కెటిల్‌; పుస్తకాలు చదువుకునేందుకు ఓ టేబులు, కుర్చీని సమకూర్చాలంటూ దిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తిహాడ్‌ జైలు అధికారులకు సూచించారు.

తిహాడ్‌ జైల్లో అప్రమత్తత

తిహాడ్‌ జైల్లో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌కు ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేజ్రీవాల్‌ ఉన్న సెల్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 

సీఎం 4.5 కేజీల బరువు తగ్గారు :ఆతిశీ

సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గడిచిన 12 రోజుల్లో 69.5 కేజీల నుంచి నాలుగున్నర కేజీలు తగ్గి 65కు చేరుకున్నారని బుధవారం ఆప్‌ నాయకురాలు ఆతిశీ ఆరోపించారు. అయితే కేజ్రీవాల్‌ ఏమాత్రం బరువు తగ్గలేదని.. ఈ నెల 1న ఆయన జైలుకు వచ్చినప్పుడు, ఇప్పుడూ 65 కేజీలే ఉన్నారని తిహాడ్‌ జైలు అధికారులు స్పష్టీకరించారు.

జైలు నుంచి సంజయ్‌సింగ్‌ విడుదల

సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆరోగ్య పరీక్షల అనంతరం ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ బుధవారం తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడ నుంచి ఆయన నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని కేజ్రీవాల్‌ భార్య సునీతతో భేటీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని