112 ఏళ్ల టైటానిక్‌ విషాదం.. ఛత్తీస్‌గఢ్‌లో ఆరని విద్యాదీపం

సరిగ్గా 112 ఏళ్ల క్రితం ఏప్రిల్‌ 15న ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో మునిగి దాదాపు 1,500 ప్రాణాలను జలసమాధి చేసిన టైటానిక్‌ ఓడ విషాదం తలచుకొని ప్రపంచం ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది.

Published : 16 Apr 2024 05:45 IST

అమెరికన్‌ మహిళ అన్నీ ఫంక్‌ త్యాగనిరతి

ఈటీవీ భారత్‌: సరిగ్గా 112 ఏళ్ల క్రితం ఏప్రిల్‌ 15న ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో మునిగి దాదాపు 1,500 ప్రాణాలను జలసమాధి చేసిన టైటానిక్‌ ఓడ విషాదం తలచుకొని ప్రపంచం ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది. భారత్‌కు  స్వాతంత్య్రం రాకముందు ఇక్కడ బాలికల విద్య కోసం కృషి చేసిన విదేశీ మహిళ అన్నీ క్లెమెర్‌ ఫంక్‌ నాటి టైటానిక్‌ ప్రమాదంలో మరణించారు. ఆమె చనిపోయి వందేళ్లు దాటినా ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు ‘విద్యాదాత’గా తన సేవలను ఇప్పటికీ గుర్తుచేసుకొంటూనే ఉన్నారు. 1874 ఏప్రిల్‌ 12న అమెరికాలో జన్మించిన అన్నీ క్లెమెర్‌ ఫంక్‌ 1906లో భారత్‌కు వచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని వెనుకబడిన ప్రాంతమైన జాంజగీర్‌ చాంపాలో మహిళావిద్యపై ప్రజల్లో ఆమె అవగాహన కల్పించారు. 1907లో అక్కడే ఓ మెమోరియల్‌ పాఠశాలను, వసతిగృహాన్ని స్థాపించారు. ఆ స్కూలులో 17 మంది బాలికలు చదువుకునేవారు. తల్లి ఆరోగ్యం బాగాలేదని 1912 ఏప్రిల్‌ 6న ఫంక్‌ తన స్వస్థలమైన పెన్సిల్వేనియాకు బయలుదేరారు. ఏప్రిల్‌ 10న బ్రిటన్‌లో ఆమె  టైటానిక్‌ ఓడ ఎక్కారు. అదే ఓడలో ఏప్రిల్‌ 12న పుట్టినరోజు జరుపుకొన్న ఆమెకు మరో రెండు మూడు రోజులకే నూరేళ్లు నిండాయి. ఓడ మునిగిపోతున్న సమయంలోనూ అన్నీ ఫంక్‌ తన లైఫ్‌ జాకెట్‌ను సహ ప్రయాణికులైన తల్లీబిడ్డలకు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఫంక్‌ ఏర్పాటుచేసిన స్కూలు 1960 వరకు నడిచింది. ఆ తర్వాత సొసైటీ నిర్వహిస్తున్నట్లు ఈ పాఠశాల ప్రిన్సిపల్‌ సరోజినీ సింగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని