అయోధ్య బాలరాముడికి ‘సూర్య తిలకం’

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ కనువిందు చేయనుంది.

Published : 16 Apr 2024 03:58 IST

 శ్రీరామనవమి రోజు.. మధ్యాహ్నం 12 గంటలకు
 ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సీబీఆర్‌ఐ సంస్థ

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ కనువిందు చేయనుంది. సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో, ఐదు నిమిషాలపాటు ప్రసరించనున్నాయి. రామాలయ నిర్మాణ సమయంలో ట్రస్ట్‌ సభ్యుల కోరిక మేరకు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు సూర్యతిలకం ఏర్పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని.. సీబీఆర్‌ఐ ప్రతినిధి, హైదరాబాద్‌కు చెందిన డా.ప్రదీప్‌కుమార్‌ రామన్‌ చెర్ల తెలిపారు.

 19 ఏళ్లపాటు నవమి రోజునే వచ్చేలా..

సూర్యతిలకం 19 ఏళ్లపాటు శ్రీరామనవమి రోజు శ్రీరాముడి విగ్రహంపై ఏర్పడనుంది. ఇందుకోసం బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(ఐఐఏ) శాస్త్రవేత్తలను, పరిశోధకులను సీబీఆర్‌ఐ సంప్రదించింది. వారు అధ్యయనం చేసి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా.. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. వీటిని బెంగళూరులోని ఆప్టికా సంస్థ సమకూర్చింది. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరిస్తుంది. ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా? గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉంటుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్‌ టీత్‌ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలి.

ఎక్కడా ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ ప్రతినిధులు డా.ప్రదీప్‌కుమార్‌ రామన్‌ చెర్ల, డాక్టర్‌ ఎస్‌.కె.పాణిగ్రహి, ఆర్‌.ఎస్‌.బిస్త్‌, కాంతి సోలంకి, వి.చక్రధర్‌, ఐఐఏ ప్రతినిధి డాక్టర్‌ అన్నపూర్ణి జాగ్రత్తలు చేపట్టారు. అయోధ్య రామాలయంలో ఈ నెల 8న సూర్యతిలకం ఎలా ఏర్పడనుందన్న అంశాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు