కేజ్రీవాల్‌ను కరడుగట్టిన తీవ్రవాదిలా చూస్తున్నారు

తిహాడ్‌ జైలులో ఉన్న ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సోమవారం పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ జడ్‌ ప్లస్‌ భద్రత మధ్య కలుసుకున్నారు.

Updated : 16 Apr 2024 05:36 IST

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ 
తిహాడ్‌ జైలులో ఆప్‌ అధినేతతో భేటీ

దిల్లీ: తిహాడ్‌ జైలులో ఉన్న ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సోమవారం పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ జడ్‌ ప్లస్‌ భద్రత మధ్య కలుసుకున్నారు. గాజు గోడ ఉన్న ప్రత్యేకగదిలో భగవంత్‌ మాన్‌, ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ అరగంటసేపు కేజ్రీవాల్‌తో ఫోనులో మాట్లాడారు. అనంతరం మీడియాతో సంభాషించిన పంజాబ్‌ సీఎం..జైలులో కేజ్రీవాల్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యానని, ఆయన్ను కరడుకట్టిన నేరస్థుడిలా చూస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసిన తప్పేమిటి? దిల్లీ ప్రజలకు మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఉచిత కరెంటు అందించడమేనా?అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం జైలులో ఉన్నప్పుడు సోనియాగాంధీ స్వయంగా కలుసుకునేవారని..కానీ ఇప్పుడు తాము గాజు గోడల మధ్య నిలబడిపోయామని వాపోయారు. ఇండియా కూటమి అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కేజ్రీవాల్‌ తనను కోరినట్లు మాన్‌ తెలిపారు. జూన్‌ 4 ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే వారం నుంచి మంత్రులతో దిల్లీ సీఎం భేటీలు

జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ వచ్చే వారం నుంచి ఇద్దరేసి మంత్రులతో కారాగారంలోనే సమావేశమవుతారని ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సందీప్‌ పాఠక్‌ సోమవారం వెల్లడించారు. ఆ భేటీల సందర్భంగా ఆయా మంత్రుల శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిని సీఎం సమీక్షిస్తారన్నారు.

ఆప్‌ నిధుల నిర్వాహకుడి అరెస్టు

గోవా శాసనసభ ఎన్నికల్లో ఆప్‌ నిధులను నిర్వహించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చాన్‌ప్రీత్‌ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోమవారం అరెస్టు చేసింది. దిల్లీ మద్యం విధానం అంశంలో మనీ లాండరింగ్‌ చట్టం కింద అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకూ నమోదైన అరెస్టుల సంఖ్య 17కు చేరింది. గతంలో ఇదే కేసుకు సంబంధించి చాన్‌ప్రీత్‌ను సీబీఐ అరెస్టు చేసింది.


ఈడీ ముందు హాజరుకండి
- ఆప్‌ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు సూచన

దిల్లీ వక్ఫ్‌బోర్డులో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మనీలాండరింగ్‌ జరిగిందన్న కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఈడీ ముందు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది. ఈ సందర్భంగా మార్చి 11న దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాల్లో కోర్టు మినహాయింపును కల్పించింది. దిల్లీ వక్ఫ్‌బోర్డులో అక్రమంగా నియామకాలు చేపట్టారంటూ గత కొంతకాలంగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తాజాగా ఈడీ సమర్పించిన ఛార్జిషీట్‌లో ఆయన పేరులేకపోయినా...ఖాన్‌కు అత్యంత సన్నిహితులైన అయిదుగురి పేర్లను అందులో చేర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని