బస్తర్‌కు హెలికాప్టర్లలో పోలింగ్‌ సిబ్బంది

లోక్‌సభ ఎన్నికల్లో ఈ నెల 19న తొలివిడత పోలింగు జరగనున్న రాష్ట్రాల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్‌ సిబ్బందిని హెలికాప్టర్లలో తరలించే ప్రక్రియ మంగళవారం మొదలైంది.

Published : 17 Apr 2024 03:46 IST

అరుణాచల్‌ నుంచి చైనా సరిహద్దులకు కూడా...

బీజాపుర్‌/సుక్మా (ఛత్తీస్‌గఢ్‌), ఇటానగర్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఈ నెల 19న తొలివిడత పోలింగు జరగనున్న రాష్ట్రాల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్‌ సిబ్బందిని హెలికాప్టర్లలో తరలించే ప్రక్రియ మంగళవారం మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలైన బీజాపుర్‌, సుక్మా జిల్లా కేంద్రాల నుంచి ఈవీఎంలు, ఇతర సామగ్రితో 103 పోలింగు బృందాలు తరలుతున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో పలుమార్లు భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు దాడులు చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని క్రా దాదీ జిల్లాకు చెందిన నాలుగు మారుమూల పోలింగు కేంద్రాలకు పోలింగు సిబ్బంది, పోలీసులను వాయుమార్గాన తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఈశాన్య రాష్ట్రంలో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో ఈ నెల 19న జరగనున్నాయి. తాలీ పట్టణంలో విడిది చేసే ఎన్నికల సిబ్బంది ఆ తర్వాత కాలినడక మార్గాన చైనా సరిహద్దులోని పిప్సోరంగ్‌ సర్కిల్‌కు చేరుకుంటారు. రాష్ట్రంలోని మొత్తం 2,226 పోలింగు కేంద్రాల్లో 228 కేంద్రాలకు కాలినడకన మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

గడ్చిరోలి జిల్లాలో..

బల్లార్ష, న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిధులు నిర్వర్తించేందుకు 306 మంది పోలింగ్‌ సిబ్బందిని మంగళవారం 9 హెలికాప్టర్ల ద్వారా ఆయా కేంద్రాలకు తరలించారు. అహెరి, ఆర్మోరి, బామ్రాగడ్‌ తదితర తాలుకాల్లో 68 పోలింగు కేంద్రాలను అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. బీఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌కు చెందిన 1,500 మంది బలగాలను కూడా తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని