భద్రతా బలగాల మానసిక యుద్ధం!

మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్‌మాడ్‌లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.

Published : 18 Apr 2024 05:39 IST

 అబూఝ్‌మాడ్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రత్యేక వ్యూహం
దండకారణ్యంలో ఎఫ్‌వోబీల ఏర్పాటుతో గురి
‘ఆపరేషన్‌ కగార్‌’తో వ్యూహాత్మక అడుగులు

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్‌మాడ్‌లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. వీలైనన్ని ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌(ఎఫ్‌వోబీ)లను ఏర్పాటు చేస్తూ దండకారణ్యంలోకి విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా బస్తర్‌, బీజాపుర్‌, దంతేవాడ, కాంకేర్‌, కొండగావ్‌, నారాయణపుర్‌, సుక్మా జిల్లాలతో కూడిన బస్తర్‌ డివిజన్‌పై దృష్టి సారించాయి. ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయగలిగితే దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయవచ్చనే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో 90 శాతానికిపైగా బస్తర్‌ డివిజన్‌లో జరిగినవే కావడంతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 30 శాతం ఘటనలూ ఈ డివిజన్‌ పరిధిలోనే చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్‌ కగార్‌’ను ప్రారంభించి.. కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల యూనిట్లను ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నారు. ఇటీవలే ఒడిశా నుంచి మూడు బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్లను.. మరోవైపు, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) యూనిట్‌ను అబూఝ్‌మాడ్‌కు తరలించారు. ప్రస్తుతం నారాయణపుర్‌, రాజ్‌నంద్‌గావ్‌, కొండగావ్‌లలో 8 ఐటీబీపీ బెటాలియన్లను మోహరించడంతోపాటు కొత్త ఎఫ్‌వోబీల ఏర్పాటు ముమ్మరంగా సాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల భాజపా ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం భద్రతా బలగాల వ్యూహరచన ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. కాంకేర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ ఇందుకు బలం చేకూర్చుతోంది. ఏకంగా 29 మంది మావోయిస్టుల్ని మట్టుపెట్టడం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలకు దక్కిన అతిపెద్ద విజయంగా పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంలో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఈ తరహా భారీ ఎన్‌కౌంటర్లు రెండు జరిగినా.. మావోయిస్టుల కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

వ్యూహాత్మకంగానే పూవర్తిలో ఎఫ్‌వోబీ

ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది జనవరి 30న సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేసి.. ముగ్గురు జవాన్లను చంపేయడంతోపాటు 15 మందిని గాయపరిచారు. అదే సమయంలో ఇంద్రావతి నదీతీర ప్రాంతంలోని బీజాపుర్‌ జిల్లా తాడోపోట్‌లో 100 మంది వరకు మావోయిస్టులు దాక్కునే టన్నెల్‌ను భద్రతాబలగాలు గుర్తించాయి. ఇలా ఈ ఏడాది మొదట్లోనే అటు భద్రతాబలగాలు.. ఇటు మావోయిస్టులు ఆధిపత్యం సాధించేందుకు వ్యూహాల్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సుక్మా-బీజాపుర్‌ జిల్లాల సరిహద్దుల్లోని పూవర్తిలో ఫిబ్రవరిలో ఎఫ్‌వోబీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. గెరిల్లా దాడుల్లో ఆరితేరిన బెటాలియన్‌ కమాండర్‌ మడావి హిడ్మా స్వగ్రామం పూవర్తి కావడమే ఇందుకు కారణం. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో హిడ్మా తల్లికి చికిత్స అందించడం ద్వారా ఆదివాసీలకు భద్రతాబలగాలు ఒక సందేశం పంపించే ప్రయత్నం చేశాయి. గతంలో ఆ ప్రాంతంలో మావోయిస్టులు ‘జనతన సర్కార్‌’ పేరిట సొంత ప్రభుత్వాన్ని నడిపించడం గమనార్హం. అలాంటిచోట మావోయిస్టులపై మానసికంగా పైచేయి సాధించేందుకు భద్రతాబలగాలు ఏకంగా ఎఫ్‌వోబీ ఏర్పాటు చేశాయి. ఒకప్పుడు అడుగుపెట్టడమే కష్టమైన ఆ ప్రాంతంలో ఏకంగా భద్రతాబలగాలు గంటలకొద్దీ గడపడం గమనార్హం.

మూడేళ్లలో 63 శిబిరాలతో విస్తరణ

అబూఝ్‌మాడ్‌లోకి విస్తరించడంలో భాగంగా ప్రతి 4 కిలోమీటర్లకో ఎఫ్‌వోబీని ఏర్పాటు చేయడం ద్వారా భద్రతాబలగాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. 2020 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో 63 ఎఫ్‌వోబీలను ఏర్పాటు చేశాయి. గడిచిన నాలుగు నెలల్లో ఒక్క కాంకేర్‌ జిల్లాలోనే ఏకంగా 8 ఎఫ్‌వోబీలను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ ఎఫ్‌వోబీల్లో సీఆర్పీఎఫ్‌, కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసల్యూట్‌ యాక్షన్‌(కోబ్రా), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌), డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ), బస్తర్‌ ఫైటర్స్‌తోపాటు స్థానిక పోలీసులు ఉండేలా చూసుకోవడం ద్వారా గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటున్నాయి. గతంలో ఒక్క సీఆర్పీఎఫ్‌ బలగాలు మాత్రమే క్షేత్రస్థాయి ఆపరేషన్లకు వెళ్లి.. పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఆ తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం ద్వారా ఎఫ్‌వోబీల్లో డీఆర్‌జీ, బస్తర్‌ ఫైటర్స్‌, కోబ్రా, ఎస్‌పీఎఫ్‌.. తదితర బలగాలుండేలా చూసుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని