సంక్షిప్త వార్తలు (5)

లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ నేపథ్యంలో కూచ్‌ బిహార్‌లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌కు స్పష్టంచేసింది.

Updated : 18 Apr 2024 05:37 IST

ఎన్నికల వేళ కూచ్‌ బిహార్‌ పర్యటనకు వెళ్లొద్దు
పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌కు ఈసీ స్పష్టీకరణ

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ నేపథ్యంలో కూచ్‌ బిహార్‌లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌కు స్పష్టంచేసింది. ఈ తరహా పర్యటనలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈసీ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కూచ్‌ బిహార్‌లో ఈ నెల 19న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి ప్రచార కార్యక్రమాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గురు, శుక్రవారాల్లో కూచ్‌ బిహార్‌లో పర్యటించాలని గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ నిర్ణయించారు. ఎన్నికల నియమావళి ప్రకారం.. ఆ పర్యటన షెడ్యూల్‌లో పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణ కుదరదని ఈసీ స్పష్టంచేసింది.  


హేమంత్‌ సోరెన్‌ ఈడీ కేసులో మరో నలుగురి అరెస్టు

రాంచీ: ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌పై నమోదు చేసిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో నలుగురిని అరెస్టు చేసింది. మంగళవారం ఈడీ.. అంతు టిర్కీ సహా మరి కొందరి నివాసాల్లో సోదాలు నిర్వహించింది. అనంతరం టిర్కీ, ప్రియరంజన్‌ సహాయ్‌, బిపిన్‌ సింగ్‌, ఇర్షాద్‌లను అదుపులోకి తీసుకుంది.


ఉజ్బెకిస్థాన్‌లో భారత్‌ నిర్మించిన ఐటీ ల్యాబ్‌ ప్రారంభం

దిల్లీ: ఉజ్బెకిస్థాన్‌లో భారత్‌ నిర్మించిన అత్యాధునిక సమాచార సాంకేతిక (ఐటీ) ప్రయోగశాలను భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌పాండే బుధవారం ప్రారంభించారు. ఉజ్బెకిస్థాన్‌ సాయుధ బలగాల అకాడమీలో ఏర్పాటుచేసిన ఈ ల్యాబ్‌లో సైబర్‌ భద్రతా ప్రయోగశాల కూడా ఉంటుంది. దీనికి విదేశీ వ్యవహారాల శాఖ యురేషియా ఇనీషియేటివ్‌ కింద రూ.8.5 కోట్లు కేటాయించింది.


బెంగాల్‌లో నవమి ఊరేగింపుపై రాళ్లదాడి

ముర్షీదాబాద్‌: శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లాలో నిర్వహిస్తున్న ఊరేగింపుపై కొందరు రాళ్లు విసిరారు. దీనిలో పలువురు గాయపడ్డారు. స్వల్పస్థాయి పేలుడు ఘటన కూడా చోటు చేసుకుంది. వీటిలో పలువురు గాయపడ్డారు. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పాటు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అదనపు బలగాలు రప్పించి, పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు.


సదుపాయాలు కల్పించలేకపోతే వేరే విభాగాల్లోకైనా మార్చండి
 రైల్వేబోర్డుకు మహిళా లోకోపైలట్ల వినతి

దిల్లీ: ‘ఇంజిన్లలో మరుగుదొడ్లు ఉండవు. ఏ అర్ధరాత్రి పూట రైలు బోగీల్లో ఎవరు చైన్‌ లాగినా ఇంజిన్‌ దిగి అక్కడికి వెళ్లి సరిచేయాలి. విశ్రాంతి గృహాల్లో మాకు విడిగా వసతి ఉండదు. ఈ పరిస్థితులను మార్చండి, లేదా మమ్మల్ని వేరే విభాగానికి మార్చండి’ అని రైల్వే మహిళా లోకోపైలట్లు రైల్వేబోర్డుకు విన్నవించుకున్నారు. అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య సభ్యులైన కొందరు లోకోపైలట్లు ఇటీవల రైల్వేబోర్డు ఛైర్‌పర్సన్‌కు వినతిపత్రం సమర్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు