కేజ్రీవాల్‌, కవిత జ్యుడిషియల్‌ కస్టడీ మే 7 వరకు

మద్యం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది.

Updated : 24 Apr 2024 04:31 IST

బెయిల్‌ పిటిషన్‌పై నేడూ వాదనలు

ఈనాడు, దిల్లీ: మద్యం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. ఇద్దర్నీ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరుపరచాలని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించారు. ఈ కేసులో కవిత మార్చి 15న, కేజ్రీవాల్‌ మార్చి 21న అరెస్టు అయ్యారు. మరోవైపు ఈడీ కేసులో బెయిల్‌ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇదే కోర్టులో వాదనలు జరిగాయి. సోమవారం కవిత న్యాయవాదుల వాదనలకు ఈడీ న్యాయవాది జోయబ్‌హుస్సేన్‌ కౌంటర్‌ ఇచ్చారు. కవిత అరెస్టులో ఈడీ చట్టబద్ధంగానే వ్యవహరించిందని, ఎక్కడా పొరపాటు జరగలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమె విషయంలో తొందరపాటు చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. ఆమెకు విచారణకు హాజరయ్యే సమయం లేకపోతే వచ్చే పది రోజులు సమన్లు ఇవ్వబోమని మాత్రమే గత ఏడాది సెప్టెంబరు 26న సుప్రీంకోర్టుకు ఈడీ చెప్పిందని, ఆ గడువు అప్పటితోనే పూర్తయిపోయిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆమెను మార్చి 15న సాయంత్రం 5.20 గంటలకు.. సూర్యాస్తమయం లోపే ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలిపారు.

ఆ రోజు హైదరాబాద్‌లో సూర్యాస్తమయం 6.26 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. అరెస్టుకు కారణాలను వివరించి ఆమె సంతకం కూడా తీసుకున్నామని, 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరిచామని చెప్పారు. తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కవిత మార్చి 19న ఉపసంహరించుకున్నట్లు ఈడీ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమె పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారంటే అరెస్టు చట్టబద్ధంగా జరిగినట్లేనని పేర్కొన్నారు. నిందితురాలికి వ్యతిరేకంగా శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బుచ్చిబాబులు వాంగ్మూలాలిచ్చినట్లు చెప్పారు. తమ వాదనలు వినిపించడానికి మరింత సమయం ఇవ్వాలని జోయబ్‌హుస్సేన్‌ విజ్ఞప్తి చేశారు. దాంతో న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈడీ వాదనల అనంతరం కవిత న్యాయవాదులు తమ వివరణ ఇవ్వనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు