దేశంలో పేటెంట్స్‌ ఫైలింగ్‌లో వృద్ధి

దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్‌) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్‌ వెల్లడించింది.

Published : 28 Apr 2024 05:11 IST

దక్షిణాది విద్యాసంస్థల నుంచి అధికం
అగ్రస్థానంలో తమిళనాడు, ఆరో స్థానంలో తెలంగాణ
నాస్కామ్‌ ‘పేటెంట్స్‌ ట్రెండ్స్‌ ఇండియా’ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్‌) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్‌ వెల్లడించింది. గత ఐదేళ్లలో పేటెంట్స్‌ ఫైలింగ్‌లో వార్షిక పెరుగుదల రేటు 24.6 శాతంగా నమోదవుతోందని, గత నాలుగేళ్లలో లభించిన పేటెంట్ల సంఖ్య రెండింతలైందని తెలిపింది. దేశవ్యాప్తంగా దిల్లీ, కోల్‌కతా, ముంబయి, చెన్నైలోని పేటెంట్‌ ఫైలింగ్‌ కార్యాలయాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, నూతన టెక్నాలజీలకు సంబంధించిన నిపుణులను నియమించాల్సిన అవసరముందని తెలిపింది. నాస్కామ్‌ సంస్థ ‘పేటెంట్స్‌ ట్రెండ్స్‌ ఇండియా’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు పేర్కొంది. పేటెంట్స్‌ దాఖలులో ఎన్నారైల వాటా కంటే.. స్థానికుల వాటా పెరుగుతోంది. 2019లో స్థానికుల వాటా 33.6 శాతం నుంచి 2023 నాటికి 52.3 శాతానికి పెరగ్గా, ఎన్నారైల వాటా 66.4 శాతం నుంచి 47.7 శాతానికి తగ్గిందని వివరించింది. ఆవిష్కర్తలు మెరుగైన, పరిపూర్ణమైన ఆలోచన వచ్చిన వెంటనే పేటెంట్‌కు దరఖాస్తు చేయాలని.. మార్కెట్లోకి వెళ్లేంత వరకు ఆగాల్సిన పనిలేదని నివేదిక సూచించింది.

అక్కడి సదుపాయాలతో ప్రోత్సాహం

దేశవ్యాప్తంగా పేటెంట్స్‌ ఫైలింగ్‌లో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ ఆరో స్థానం, ఏపీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. తమిళనాడు 9.3 శాతం, మహారాష్ట్ర 6.8 శాతంతో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అగ్రభాగాన ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విధానాలు, రిజిస్ట్రేషన్లకు రాయితీలు, సలహా కేంద్రాలు, పరిశోధన-అభివృద్ధి, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ సౌకర్యాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన 2 శాతం మంది సైంటిస్టుల్లో 200 మంది తమిళనాడు నుంచి ఉండటం విశేషం. ఐఐటీ మద్రాస్‌, స్టేట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్యక్రమాలు డిగ్రీ, పీజీ విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తున్నాయి.

డీప్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌ సంస్థ టాప్‌

దేశంలోని విద్యాసంస్థల నుంచి దాఖలవుతున్న పేటెంట్స్‌ ఏడాది వ్యవధిలోనే 11 నుంచి 23 శాతానికి చేరాయి. 2022లో 7,400 దరఖాస్తులుండగా.. 2023 నాటికి 19,200కి చేరాయి. బెంగళూరు ఐఐఎస్‌సీ ఇప్పటివరకు వెయ్యి పైచిలుకు దరఖాస్తులు చేయగా.. 600కి పైగా పేటెంట్లు లభించాయి. ఇందులో మహిళా ఆవిష్కర్తలకు సంబంధించినవి 150కి పైగా ఉన్నాయి. ఐఐటీ మద్రాస్‌ నుంచి 2700కు పైగా దాఖలైతే.. 1300కి పైగా అనుమతులు లభించాయి. డీప్‌ టెక్నాలజీ స్టార్టప్‌ పేటెంట్లలో హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన విసిగ్‌ నెట్‌వర్క్స్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ హైదరాబాద్‌ ఐఐటీ బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం నుంచి వైర్‌లెస్‌ టెక్నాలజీ సంస్థగా ఆవిర్భవించింది. 5జీ నెట్‌వర్క్‌లో పనిచేస్తోంది. 5జీ టెక్నాలజీపై విసిగ్‌ సంస్థకు 160 పేటెంట్లు ఉన్నాయి.

ఏఐ, ఐవోటీ టెక్నాలజీలు అధికం

డీప్‌ టెక్నాలజీ స్టార్టప్‌లలో అమెరికా తరువాత భారత్‌లోనే ఎక్కువగా పేటెంట్లు దాఖలవుతున్నాయి. దేశంలోని దిల్లీ, ముంబయి, కోల్‌కతా కార్యాలయాలతో పోల్చితే చెన్నై పేటెంట్‌ కార్యాలయానికి దేశంలోని 70 శాతం డీప్‌టెక్‌ స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. హెల్త్‌కేర్‌, ఆటోమేషన్‌ - సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఈ-కామర్స్‌, కస్టమర్‌ సర్వీస్‌ ఆటోమేషన్‌ రంగాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టెక్నాలజీల పరంగా కృత్రిమమేధ (ఏఐ) అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, న్యూరో టెక్నాలజీ, నానో టెక్నాలజీ రంగాలు ఉన్నాయి.


మౌలిక సదుపాయాలు ఇలా..

  • దేశంలో పేటెంట్‌ తుది నిర్ణయానికి ఎక్కువ సమయం పడుతోంది. జపాన్‌లో 15 నెలలు, చైనాలో 16.5 నెలలు, అమెరికాలో 23.1 నెలలు, యూకేలో 32 నెలల సమయం తీసుకుంటే భారత్‌లో ఈ సమయం 51 నెలలలు ఉండటం గమనార్హం.  
  • అమెరికాలో పేటెంట్‌ ఎగ్జామినర్లు 8234 మంది ఉంటే.. జపాన్‌లో 1662 మంది, భారత్‌లో 597 మంది ఉన్నారు. యూకేలో ఒక్కో ఎగ్జామినర్‌కు 57 దరఖాస్తులు ఉంటే.. భారత్‌లో 129 ఉన్నాయి.
  • ఎగ్జామినర్ల సగటు అనుభవం అమెరికాలో 13.7 ఏళ్లు, యూకేలో 13.6, భారత్‌లో 5.9 ఏళ్లు ఉంది. భారత్‌లో ప్రతి ఎగ్జామినర్‌ వద్ద 418 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
  • ఈ సమస్యలు పరిష్కరించాలి...
  • ఇండియన్‌ పేటెంట్‌ సెర్చ్‌ పోర్టల్‌ (ఇన్‌పాస్‌) అంతర్జాతీయ ప్రమాణాల మేరకు, అందరికీ స్నేహపూర్వకంగా ఉండాలి. అప్పటికే దాఖలైన పేటెంట్లు, ఆవిష్కరణల సమగ్ర వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలి.
  • పేటెంట్‌ దాఖలు ప్రక్రియ మరింత సులభతరం చేయాలి. కార్యాలయాల్లో డొమైన్‌, సాంకేతిక నిపుణులను నియమించాలి. సందేహాలు నివృత్తి చేసేందుకు అవసరమైన సహాయం, చాట్‌బాట్‌, కస్టమర్‌ కేర్‌ సౌకర్యాలు కల్పించాలి.
  • పేటెంట్‌ దాఖలుకు అవసరమైన అర్హతలు, వివరాలన్నీ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ చేయాలి. కొత్త టెక్నాలజీలపై నిపుణుల సంఖ్య పెంచాలి. దరఖాస్తులు వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి.
  • అంతర్జాతీయ పేటెంట్‌ ఫైల్‌కు సంబంధించి సదుపాయాలు కల్పించాలి. దరఖాస్తులు సకాలంలో పరిష్కరించేలా అవసరమైన న్యాయ సహాయం కల్పించాలి.
  • పరిశ్రమలు, విద్యాలయాల మధ్య టెక్నాలజీ బదిలీలకు సంబంధించి కేంద్రీకృత వ్యవస్థ ఉండాలి. తద్వారా పరిశ్రమ, విద్యాలయాలు సంఘటితమై ఉత్పత్తులను ముందుకు తీసుకెళ్లవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు