ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు

ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు.

Published : 28 Apr 2024 06:21 IST

ఈటీవీ భారత్‌: ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగింది. జిల్లాలోని నవాబాద్‌ ప్రాంతానికి చెందిన కాజల్‌ శర్మ అనే బాలిక ఓ రోజు ఇంట్లో ఆకస్మాత్తుగా కింద పడిపోయింది. దీంతో ఎడమ మోచేతి ఎముక విరిగిపోయింది. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఓ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ ఆ బాలిక చేతికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పాడు. గతేడాది డిసెంబర్‌ 22న శస్త్రచికిత్స చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. అయితే, ఆపరేషన్‌ మొదలు పెట్టిన కొద్ది సేపటికే ఆకలిగా ఉందని, మసాలా దోశ తిని వచ్చి పూర్తి చేస్తానని చెప్పిన వైద్యుడు మధ్యలోనే వెళ్లిపోయాడు. దాదాపు 2గంటల తర్వాత తిరిగి వచ్చి శస్త్రచికిత్సను పూర్తి చేశాడు. అయినప్పటికీ చేతికి నయం కాలేదని, వేళ్లు కూడా వంకరగా మారాయని బాలిక కుటుంబ సభ్యులు మళ్లీ ఆ వైద్యుడిని కలిసేందుకు ఆసుపత్రికి వచ్చారు. అయితే వారిని కలిసేందుకు వైద్యుడు నిరాకరించాడు. దీంతో ఆ బాలిక మరో ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఈ విషయమై నవాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో వైద్యుడిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ తర్వాత ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదని చెప్పారు. త్వరలోనే నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు