మాలీవాల్‌ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు

ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్‌లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

Published : 20 May 2024 06:22 IST

దిల్లీ: ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్‌లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ నెల 16న వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం స్వాతి మాలీవాల్‌కు ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వెల్లడైంది. ఎడమకాలుపై, కుడి కన్ను కింద గాయం ఉందని వైద్య నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దాదాపు 3 గంటలు వైద్యపరీక్షలు నిర్వహించగా ముఖంపై గాయాలతో పాటు శరీరం లోపల కూడా గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. ఇది స్వాతి మాలీవాల్‌ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉంది.  

 సాక్ష్యాలను బిభవ్‌ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు

మాలీవాల్‌పై దాడి చేసిన ఆరోపణల కేసులో సీసీటీవీ ఫుటేజీని, సాక్ష్యాలను నిందితుడు బిభవ్‌ కుమార్‌ ధ్వంసం చేసి ఉండొచ్చని దిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ పార్లమెంటు సభ్యురాలిపై, సీఎం ఇంట్లో దాడి జరగడం చాలా తీవ్రమైన పరిణామమని దిల్లీ డిప్యూటీ కమిషనర్‌ అంజిత చెప్యాల అన్నారు. దర్యాప్తు సమయంలో నిందితుడు సహకరించలేదని, సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసులో నిందితుడికి తీస్‌ హజారీ కోర్టు ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. బిభవ్‌ కుమార్‌ తన ఐఫోన్‌ పాస్‌వర్డ్‌ను తెలపడానికి సైతం నిరాకరించారని పోలీసులు పేర్కొన్నారు. తన ఫోన్‌ హ్యాంగ్‌ అయినందున దానిని ముంబయిలో ఫార్మాట్‌ చేయించానని దాటవేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాబట్టి బిభవ్‌ను ముంబయి తీసుకెళ్లి మొబైల్‌ను అన్‌లాక్‌ చేయిస్తామన్నారు. సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నామని, అందులోని ఫుటేజీలో కొంత భాగం ఖాళీగా ఉందని వారు పేర్కొన్నారు. నిందితుడు బయట ఉంటే తన హోదాను ఉపయోగించి సాక్షులను బెదిరించవచ్చు, సాక్ష్యాలను తారుమారు చేయవచ్చనే కారణంతో ఆయనను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరోవైపు ఆదివారం కూడా కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ డీవీఆర్‌ సహా పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 

 కథలు అల్లుతున్న పోలీసులు: ఆప్‌

కేజ్రీవాల్‌ నివాసంలోని డ్రాయింగ్‌ రూంలో అసలు సీసీటీవీ కెమెరాను తానెప్పుడూ గమనించలేదని అలాంటి చోట ఎవరూ ఏర్పాటు చేసుకోరని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ ఆదివారం విలేకరులతో పేర్కొన్నారు. అసలు సీసీటీవీయే లేనప్పుడు దాని ఫుటేజీని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ నివాసానికి సంబంధించిన ఫుటేజీ అంతా పోలీసుల వద్దే ఉందని, అందులో వారు ఏదైనా విషయాన్ని గమనిస్తే దాన్ని మీడియాకు వెల్లడించాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆప్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు భాజపా తరఫున పోలీసులు కథలు అల్లుతున్నారని ఆరోపించారు. 


కేజ్రీవాల్‌ మౌనం వీడాలి

 భాజపా డిమాండ్‌

దిల్లీ: ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నాటకాలు ఆపి మౌనం వీడాలని భాజపా డిమాండ్‌ చేసింది. ‘‘సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఎందుకు మాయమైంది? ఆధారాలు నాశనం చేయడంలో నిందితుడు బిభవ్‌ కుమార్‌కు కేజ్రీవాల్‌ సహాయం చేశారా? సీఎం నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా విడుదల చేయకుండా క్లిప్పుల్లా ఎందుకు విడుదల చేశారు’’అని పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ‘ఎక్స్‌’లో నిలదీశారు. ఈ ప్రశ్నలన్నింటికీ కేజ్రీవాల్‌ సమాధానాలు ఇవ్వాలని సూచించారు. మరోపక్క భాజపా ప్రధాన కార్యాలయంలో ఈశాన్య దిల్లీ సిటింగ్‌ ఎంపీ, ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి మనోజ్‌ తివారీ మాట్లాడుతూ..నిందితుడు కుమార్‌ను రక్షించేందుకే కేజ్రీవాల్‌ ఆందోళన చేపట్టారని ఆరోపించారు. మాలీవాల్‌ కేసులో ఎందుకు ఆయన మాట్లాడటంలేదని నిలదీశారు. నిందితుడు బిభవ్‌ కుమార్‌ను ఎందుకు రక్షించాలనుకొంటున్నారు? మహిళపై చేయి చేసుకున్న వ్యక్తికి మద్దతుగా ఎందుకు నిలబడుతున్నారు. ఎంత దిగజారుడు ఆలోచన. దీన్ని చూసి దిల్లీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురవుతున్నారు’’ అని ప్రశ్నించారు. 


నిందితుల రక్షణ కోసం పోరాటమా?

ఆప్‌ నిరసనపై మాలీవాల్‌ ఆక్షేపణ

దిల్లీ: ఆప్‌ ఆదివారం నిర్వహించిన నిరసనను ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌ విమర్శించారు. ఒకప్పుడు అవినీతి, అక్రమాలపై పోరాటం జరగ్గా.. ఇప్పుడు అది నిందితుల రక్షణ కోసం జరుగుతోందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ఒకప్పుడు నిర్భయకు న్యాయం చేయాలని మనమంతా వీధుల్లోకి వచ్చాం. 12 ఏళ్ల తర్వాత ఈరోజు.. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసి, ఫోన్‌ను ఫార్మాట్‌ చేసిన నిందితుణ్ని కాపాడేందుకు వీధుల్లోకి వస్తున్నామా?’’ అని మాలీవాల్‌ ప్రశ్నించారు. తనపై దాడి చేసినట్లుగా ఆమె ఆరోపిస్తున్న కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌కు మద్దతుగా ఆందోళన కార్యక్రమం జరుగుతోందని పరోక్షంగా ఆరోపించారు. బిభవ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని