డ్రిల్లింగ్‌ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నగరం రాయ్‌పుర్‌ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్‌ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు.

Published : 20 May 2024 04:33 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నగరం రాయ్‌పుర్‌ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్‌ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉర్కురా రైల్వేస్టేషను మీదుగా వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మొదట రైల్వేట్రాకు పక్కనున్న స్తంభం పడి ఉంటుందని భావించిన అధికారులు.. ఆ తర్వాత డ్రిల్లింగు యంత్రం ముందు భాగంలోని రాడ్డు శకలాలను గుర్తించారు. రైలు రాయ్‌పుర్‌ చేరుకోగానే క్షతగాత్రులకు చికిత్స ప్రారంభించారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్‌ కేసు నమోదు చేసింది. రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ డ్రిల్లింగు పనుల్లో వాడుతున్న యంత్రానికి సంబంధించిన రాడ్డుగా దీన్ని గుర్తించారు. రైల్వేట్రాకు కింది భాగంలో చేపట్టిన ఈ పనుల గురించి కాంట్రాక్టరు రైల్వే అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. రైలు కదులుతున్న సమయంలో డ్రిల్లింగు యంత్రం రాడ్డును బయటకు లాగి ఉంటారని అధికారులు చెప్పారు.  అనూహ్యంగా అది పైకి చొచ్చుకుపోయి రైలును తాకింది. ఈ రాడ్డు కారణంగా మూడు ఏసీ బోగీలు దెబ్బతిన్నాయి. దీనిపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని