విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయింపులు తప్పనిసరి

భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడీపీలో (స్థూల జాతీయోత్పత్తిలో) ఆరు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక ‘వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (విట్‌) ఛాన్స్‌లర్‌ జి.విశ్వనాథన్‌ అభిప్రాయపడ్డారు.

Published : 21 May 2024 04:23 IST

 విట్‌ వ్యవస్థాపకుడు, ఛాన్స్‌లర్‌ జి.విశ్వనాథన్‌

చెన్నై: భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడీపీలో (స్థూల జాతీయోత్పత్తిలో) ఆరు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక ‘వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (విట్‌) ఛాన్స్‌లర్‌ జి.విశ్వనాథన్‌ అభిప్రాయపడ్డారు. గత 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఈ కేటాయింపులు ఏనాడూ మూడు శాతాన్ని మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థికవ్యవస్థ నేరుగా విద్యారంగంతో అనుసంధానమై ఉన్నందున మన రాజకీయ పార్టీలు విద్య పాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల డాక్టరేటు అందుకొన్న విశ్వనాథన్‌ను వర్జీనియాలోని అల్లింగ్టన్‌లో ‘విట్‌’ పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత విద్యారంగ ప్రగతిపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. భారత్‌లో విద్యపరంగా మెరుగ్గా ఉన్న దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల్లోనే జాతీయ సగటు (2023) కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న విషయాన్ని విశ్వనాథన్‌ గుర్తు చేశారు. కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇది దాదాపు రూ.3.33 లక్షలు (4,000 డాలర్లు) ఉండగా.. విద్యారంగంలో వెనుకబడి ఉన్న బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో రూ.83 వేలు (1,000 డాలర్లు) మాత్రమే ఉందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చి విద్యారంగానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ జీడీపీలో 5 నుంచి 7 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తున్నాయని, ఆయా దేశాలతో భారత్‌ పోటీపడాల్సి ఉందని విట్‌ వ్యవస్థాపకుడు కూడా అయిన జి.విశ్వనాథన్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని